వేసవి ముందు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

by Ratna Kumari |

వేసవికాలం ప్రారంభం కావడానికి ముందే గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు.

వేసవి ముందు తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
X

దిశ, జుక్కల్ (నిజాంసాగర్) : వేసవికాలం ప్రారంభం కావడానికి ముందే గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచించారు. శనివారం జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ డ‌బ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి అవసరం మరింత పెరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా లేదా పాడైన భాగాలు ఉన్నాయా అన్నది వెంటనే పరిశీలించి మరమ్మతులు చేయాలని సూచించారు. నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వహణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

మోటార్లు, పంపులు వంటి యంత్రాంగంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో బోర్‌వెల్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో అధికారులు తరచుగా పరిశీలించాలని అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు ఆర్ డ‌బ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజనీర్ కౌశిక్, ఏఈలు నయీమ్, సుధాకర్, రాజప్ప, ఈఈలు రమేష్, స్వప్న పాల్గొన్నారు.

Next Story