డబుల్‌ ఇళ్లు.. త్రిబుల్‌ కష్టాలు! ధర్పల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో లబ్ధిదారుల గోస

by Ramesh Naini |

ధర్పల్లి మండల కేంద్రంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లబ్ధిదారుల పాలిట కష్టాల నిలయాలుగా మారాయి. ఏడేళ్ల కిందట 48 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా.. పనులు పూర్తి కాకుండానే దసరా కానుకగా పేదలకు అప్పగించారు.

డబుల్‌ ఇళ్లు.. త్రిబుల్‌ కష్టాలు! ధర్పల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో లబ్ధిదారుల గోస
X

ధర్పల్లి మండల కేంద్రంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లబ్ధిదారుల పాలిట కష్టాల నిలయాలుగా మారాయి. ఏడేళ్ల కిందట 48 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా.. పనులు పూర్తి కాకుండానే దసరా కానుకగా పేదలకు అప్పగించారు. కాలనీలో కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పేదలు నరకం చూస్తున్నారు. కరెంట్ లేక చీకటిగా ఉండటం, విషసర్పాల భయంతో 18 మంది లబ్ధిదారులు ఇళ్లలోకి రావడానికే వెనుకాడుతున్నారు. మిషన్ భగీరథ కనెక్షన్లు లేక కాలనీ మొత్తం ఒకే నల్లాపై ఆధారపడాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మరమ్మతుల కోసం కేటాయించాల్సిన రూ.1.25లక్షల నిధులను వెంటనే ఇచ్చి అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు.

దిశ, ధర్పల్లి : ‘‘రెండు బకెట్లు పట్టుకుని నీళ్ల కోసం వెళితే.. ఒక బకెట్ నిండకముందే భగీరథ నల్లా బంద్ అయిపోతుంది. రాత్రి అయితే దీపమే మాకు దిక్కు. మరుగుదొడ్లు లేకపోవడంతో పెద్దలు, పిల్లలు, మహిళలు బయటికే వెళ్లాల్సి వస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వచ్చాయన్న సంతోషం కంటే.. ఇక్కడ పడుతున్న బాధలే ఎక్కువగా ఉన్నాయి సారు’’ ఇది ధర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట సమీపంలో గల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివసిస్తున్న లబ్ధిదారుల ఆవేదన. ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం మారడంతో అధికారులు ఆదరాబాదరాగా ఇళ్లనైతే పేదలకు అప్పగించారు. కానీ, కనీస సౌకర్యాలు లేని సమస్యల వలయాన్ని పేదలకు అందించి చేతులు దులుపుకున్నారు.

సందిగ్ధంలో మరమ్మతుల నిధులు..

ధర్పల్లి మండల కేంద్రంలో మాలగుట్ట సమీపంలో సుమారు 48 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవనాల నిర్మాణం పనులు 80 శాతం వరకు పూర్తి అయినప్పటికీ, మిగిలిన పెండింగ్ పనుల నిధుల విషయంలో పాలకులు ఎటూ తేల్చకుండా వదిలేశారు. ఒక్కో భవనానికి ఇవ్వాల్సిన రూ.1.25లక్షల నిధులను లబ్ధిదారులకు ఇచ్చి పనులు చేయించాలా..? లేదా కాంట్రాక్టర్‌తోనే పూర్తి చేయించాలా? అనే సందిగ్ధంలో కాలయాపన చేశారు. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండానే దసరా కానుకగా ఈ 48 ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. కాలనీలో సమస్యలు తాండవిస్తున్నప్పటికీ వేరే ఆధారం లేక, కిరాయిలు చెల్లించలేని స్థితిలో సుమారు 30 పేద కుటుంబాలు గత నెలలుగా ఇక్కడే నివాసం ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు లేక కష్టాలు..

ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ భవన నిర్మాణం పూర్తి చేసినప్పటికీ కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అత్యవసర సౌకర్యాలు సమకూర్చకపోవడంతో ఆ పనులు పెండింగ్‌లోనే మిగిలాయి. గత బీఆర్ఎస్ హయాంలో కొంతకాలం, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కొంతకాలం గడిచినా ఈ మూడు ప్రధాన సమస్యలను ఎవరూ పరిష్కరించలేదు. మిగిలిపోయిన ఒక్కో ఇంటికి రూ.1.25లక్షల నిధులను లబ్ధిదారులకు అందించి ఉంటే వారే పనులు చేయించుకునేవారని, కానీ అధికారులు పంపిణీ సమయంలో ఆ ఆలోచన చేయకుండా ఇళ్లను ఇచ్చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

భయాందోళనతో మరో 18 మంది దూరం..

ఇళ్లు కేటాయించి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. నేటికీ 18 మంది లబ్ధిదారులు ఇళ్లలోకి రావడానికి భయపడుతున్నారు. కాలనీలో కరెంట్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో పూర్తిగా చీకటి ఆవరిస్తోంది. దీనికి తోడు చుట్టూ పొదలు ఉండడంతో విషపూరితమైన పాములు, తేళ్లు వంటివి ఇళ్లలోకి వస్తుండడంతో ఇక్కడ ఉండటానికి ఇష్టపడడం లేదు. తాగునీటి కోసం మిషన్ భగీరథ పైప్‌లైన్ ఉన్నప్పటికీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. కాలనీ మొత్తానికి ఒకే ఒక్కచోట భగీరథ నల్లా ఉండగా.. అందులోనూ కొద్దిసేపే నీళ్లు వస్తున్నాయని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరుగుదొడ్లకు పైప్‌లైన్లు, సెప్టిక్ ట్యాంక్ లాంటివి నిర్మించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అదనపు నిధులు కేటాయించి తమ కష్టాలు తీర్చాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

నీటి కష్టాలు తప్పడం లేదు..

‘రెండు బకెట్లు తీసుకొని నీటికి వెళితే భగీరథ నల్లా ఒక బకెట్ నిండగానే బంద్ అవుతోంది. ఇలాంటి కష్టాలు రోజు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పటికీ దీపం వెలుతురులోనే బతుకుతున్నాం. మరుగుదొడ్లు లేకపోవడంతో పెద్దలు, పిల్లలు, మహిళలు బయటకే వెళ్లాల్సి వస్తోంది. మా కష్టాలు తీర్చి ఆదుకోవాలి’ - కందుల సత్తెవ్వ, లబ్ధిదారు

Next Story