కల్యాణ లక్ష్మీ దరఖాస్తులపై గెజిటెడ్ సైన్‌లో తేడా.. క్రాస్ చెక్ చేయగా బాగోతం బట్టబయలు

by Kodari Anjali |

కల్యాణ లక్ష్మీ దరఖాస్తులపై గెజిటెడ్ సైన్ లో తేడా రావడంతో అధికారులకు అనుమానం వచ్చి క్రాస్ చెక్ చేయడం వల్లే బాగోతం బట్టబయలు అయ్యింది.

కల్యాణ లక్ష్మీ దరఖాస్తులపై గెజిటెడ్ సైన్‌లో తేడా..  క్రాస్ చెక్ చేయగా బాగోతం బట్టబయలు
X

దిశ, భిక్కనూరు: ఒకటి రెండు దరఖాస్తులు అయితే... గెజిటెడ్ సైన్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. టేబుల్ పైకి ఒకేసారి కల్యాణ లక్ష్మి పథకం మంజూరు కోసం 12 దరఖాస్తులు రావడం, వాటిని సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో, రెండు మూడు పేజీల్లో సైన్ తేడా రావడంతో, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది వెంటనే గుర్తించి చిన్న అనుమానంతో ఒకసారి క్రాస్ చెక్ చేశారు. ఇంకేముంది అసలు బాగోతం బయటపడి తండ్రి కొడుకులతో పాటు మరొకరిపై కేసు నమోదు అయిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డికి చెందిన ప్రముఖ వైద్యుని సైన్ ను ఫోర్జరీ చేసి, స్టాంప్స్ వేసి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల కోసం అవసరమైన గెజిటెడ్ సైన్‌ను ఫోర్జరీ చేసి గత కొంతకాలంగా చీకటి దందా కొనసాగిస్తున్నారు. తన సైన్ ఫోర్జరీ చేసి ఈ విధంగా ఫేక్ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారని తెలసి సదరు వైద్యుడు రెండు రోజుల క్రితం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి మఫ్టీలో దరఖాస్తుదారుల వద్దకు వచ్చి సీక్రెట్ ఎంక్వయిరీ చేశారు. దీనికంతటికి కారణం ఫలానా ఇంటర్నెట్ నిర్వాహకుడు అని తెలిసి, మెదక్ జిల్లాలో అదుపులోకి తీసుకొని ఎంక్వయిరీ చేశారు. మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామానికి చెందిన ఒకరితోపాటు, ఇంటర్నెట్ నిర్వాహకున్ని అదుపులోకి తీసుకొని కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే రోజు రాత్రి మళ్ళీ పోలీసులు భిక్కనూరు లోని ఇంటర్నెట్ కేంద్రానికి చేరుకొని, అందులో ఉన్న కంప్యూటర్ ను సీజ్ చేయడంతో పాటు, హార్డ్ డిస్క్, బ్లూ పెన్స్, దొరికిన మరికొన్ని ధ్రువపత్రాలను తీసుకొని కుమారుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.

ఆ రబ్బర్ స్టాంపులు ఎక్కడివి...

ఫేక్ సైన్ తో ఇంటర్నెట్ నిర్వాహకులతో పాటు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మరొకరు పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. సైన్ ఫోర్జరీ చేసినప్పటికీ రబ్బర్ స్టాంపులు ఎక్కడ నుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం రబ్బర్ స్టాంపులను ఎక్కడ కూడా ఆషా మాషిగా ఎవరు తయారు చేసి ఇవ్వని పరిస్థితి. సంబంధిత అధికారుల రిఫరెన్స్ చేస్తే తప్ప సామాన్యులకు రబ్బర్ స్టాంపులను దుకాణ యజమానులు చేసి ఇవ్వరు. అలాంటిది సదరు అధికారుల రిఫరెన్స్ లేకుండా రబ్బర్ స్టాంపులు ఓ సాధారణ వ్యక్తికి ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంతకాలు ఫోర్జరీ చేసిన వారితో పాటుగా రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

మరికొందరిపై చర్యలు ఉండనున్నాయా...?

ఇటువంటి ఘటనలు మండలంలో ఇదివరకు కూడా జరిగినప్పటికీ, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విధంగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ప్రజల్లో నుంచి వినిపిస్తున్నాయి. అదే ఫేక్ గెజిటెడ్ సంతకాలతో, మిగతా ఇంటర్నెట్ నిర్వాహకులకు ఏమైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారన్న సమాచారం తెలియడంతో, కొందరు ఇంటర్నెట్ నిర్వాహకులలో దడ మొదలైంది. ఇప్పటికే అరెస్టు అయిన వారు ఎవరెవరికి ఈ సర్టిఫికెట్లు చేసి ఇచ్చారన్న వివరాలను సేకరిస్తున్నారని వారిని సైతం త్వరలోనే అరెస్టు చేస్తారన్న ప్రచారం భిక్కనూరులో ఊపందుకుంది.దీంతో వారితో లింకు ఉన్న మిగతా ఇంటర్నెట్ నిర్వాహకులు ఫేక్ ఫైళ్లను తొలగిస్తూ, ఏమాత్రం ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

డైరెక్ట్ గా వచ్చి దరఖాస్తు చేసుకోవాలి

షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకం కోసం అర్హులైన దరఖాస్తుదారులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని భిక్కనూరు తహసిల్దార్ సునీత అన్నారు. శుక్రవారం నాడు ఆమె తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ పథకాల కింద లబ్ధి పొందేందుకు అమాయకంగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, డైరెక్ట్ గా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు సమర్పిస్తే, అవి మంజూరు అవుతాయని, ఇందులో ఎంత మాత్రం అనుమానం అక్కర్లేదన్నారు.

Next Story