- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి 12 దాటితే దాబాలు, రెస్టారెంట్లు బంద్
అర్ధరాత్రి 12 గంటలు దాటిందంటే చాలు.. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూతబడుతున్నాయి.

44వ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు అమలు చేస్తున్న రాత్రి సమయ ఆంక్షలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు దాబాలు, హోటళ్లు, టీ పాయింట్లను పూర్తిగా మూసివేయిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది ఫోటోలు తీస్తూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గతంలో సిద్ధరామేశ్వర నగర్ వద్ద నీళ్ల బాటిల్ వివాదంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడి జరగడంతో ఆంక్షలు మరింత ముదిరాయి. హైవేలపై పెరిగిపోతున్న దొంగతనాలు, నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం ఈ ఆర్డర్స్ ఇచ్చింది. అయితే అంతంపల్లి వద్ద ఒక బంక్ కేఫ్ సెంటర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ నడుస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా సరిహద్దు దాటే వరకు చాయ్, నీళ్ల బాటిల్ కూడా దొరకకపోవడంతో అర్ధరాత్రి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, భిక్కనూరు : అర్ధరాత్రి 12 గంటలు దాటిందంటే చాలు.. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూతబడుతున్నాయి. దీంతో దూరప్రాంత ప్రయాణికులు, యాత్రికులు ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రివేళ ప్రయాణం సాగించే వారితోపాటు మహారాష్ట్ర, నాందేడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వైపు వెళ్లే వారికి కనీసం తాగునీరు, చాయ్ కూడా దొరకని పరిస్థితి నెలకొన్నది. కామారెడ్డి జిల్లా సరిహద్దు దాటి పొరుగు జిల్లాల్లోకి ప్రవేశిస్తే తప్ప నిత్యావసరాలు లభించడం లేదు. స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఫైన్లు వేయడం, జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలు గస్తీ తిరగడం, వీరు కాకుండా జీఎంఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సైతం ఫొటోలు తీసి పోలీసులకు అప్‌లోడ్ చేస్తుండడంతో వ్యాపారులు రాత్రి 12గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు పక్కాగా బంద్ పాటిస్తున్నారు. అయితే అంతంపల్లి సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ కేఫ్ సెంటర్ మాత్రం తెరిచే ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.
నీళ్ల బాటిల్ లొల్లి – సిబ్బందిపై దాడి..
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలోని ఒక దాబా వద్ద నీళ్ల బాటిల్ అడిగారు. సమయం దాటినందున ఇవ్వలేమని యజమాని చెప్పడంతో వాగ్వాదానికి దిగి, డయల్ 100కు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి కదలికలపై అనుమానం వచ్చి స్కూటీ తాళాలు, ఫోన్లు స్వాధీనం చేసుకోబోయారు. కాగా, సదరు దుండగులు ఉల్టా పోలీస్ సిబ్బందిపైనే భౌతిక దాడికి తెగబడ్డారు. అడ్డుకోబోయిన దాబా యజమానిపైనా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటినుంచి హైవేపై ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.
నేరాల నియంత్రణ కోసమే ఆంక్షలు...
హైవేలపై రాత్రివేళల్లో జరిగే దొంగతనాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను (అఫెన్స్) అరికట్టేందుకే జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటళ్లు తెరిచి ఉంచడం వల్ల నేరాలు చేసి తప్పించుకునే వారికి ఆశ్రయం దొరుకుతుందని, వారిని పట్టుకోవడం కష్టంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఆరు నెలలుగా భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ నుంచి మొదలుకొని జిల్లా సరిహద్దు వరకు రాత్రివేళల్లో దుకాణాలన్నీ పూర్తిగా మూసివేయిస్తున్నారు. నేరాల నియంత్రణ పరంగా ఇది మంచిదే అయినప్పటికీ, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువవ్వడం గమనార్హం.






