జిల్లాలో తగ్గిన నేరాలు-ఘోరాలు : ఎస్పీ రాజేష్ చంద్ర

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది పూర్తయ్యే వరకు నేరాలు-ఘోరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు.

జిల్లాలో తగ్గిన నేరాలు-ఘోరాలు : ఎస్పీ రాజేష్ చంద్ర
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది పూర్తయ్యే వరకు నేరాలు-ఘోరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన క్రైమ్ అన్యువల్ బుక్ లెట్ ను విడుదల చేశారు. 2024, 2025 సంవత్సరంలో 698 ఆస్తి సంబంధిత నేరాలు, 34 హత్యలు, 43 కిడ్నాప్, 67 రేప్ కేసులు, 470 రోడ్డు ప్రమాద కేసులు, 1315 ఇతర కేసులు, 550 స్పెషల్ లోకల్ చట్టాల కేసులు కాగా 492 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది గత ఏడాది కంటే హత్య కేసులు తగ్గినట్లు చెప్పారు. ఈ కేసులలో నిందితులందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్తి సంబందిత నేరాలు కూడా తగ్గడంతో పాటు 47% కేసులను ఛేదించి నేరస్తులను అరెస్ట్ చేసి 40% సొత్తు ఇప్పటికే స్వాదీనం చేసుకొని బాధితులకు అంధించడం జరిగిందన్నారు. మహిళలకు సంబంధిత నేరాలు కూడా తగ్గాయన్నారు. డీఎస్పీ కార్యాలయాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించేలా ప్రయత్నిస్తున్నామన్నారు. షీ టీమ్ లు ప్రతి సబ్ డివిజన్ లో చురుకుగా పని చేస్తున్నాయని వివరించారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

జిల్లాలో రోడ్డుప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గత సంవత్సరంతో పోల్చితే గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ వివరించారు. 2024లో 525 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2025 లో 442 కి తగ్గించగలిగామన్నారు. మరణాల కేసులు 262 నుండి 200 కి తగ్గాయాని తెలిపారు. గత యేడు 275 మంది మరణించగా ఈ యేడు 211 మంది మరణించారన్నారు. మరణాలలో కూడా 24% తగ్గుదల ఉన్నదన్నారు.

ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ లు

రోడ్డు ప్రమాదాలను తగ్గించి వెలకట్టలేని విలువైన ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశముతో ప్రతీరోజు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, లైసెన్స్ లేని వారిని, అతివేగంగా ప్రయాణించే వారిని గుర్తించి చలానాలు వేయడం, హాట్ స్పాట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవడం చేస్తున్నామని చెప్పారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు, లోక్ అదాలత్ లో నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు.

మత్తు పదార్థాల నివారణ

ఈ ఏడాది 23 ఎన్డీపీఎస్ /గంజాయి/నిషేదిత మత్తు పదార్థాలు కలిగిఉన్న, అమ్మిన, రవాణా, వ్యాపారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సుమారు రూ.8,59,750విలువ గల (6.67) కిలోల గంజాయి/నిషేదిత మత్తు పదార్థాలు, 43 గంజాయిమొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నిందితులకు పలు రకాల శిక్షలు విధించడం జరిగిందన్నారు.

4169 మొబైల్ ఫోన్ల రికవరీ

మొబైల్ ఫోన్ పోయినా లేదా దోపిడీకి గురైన బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామరు. ఈ ఏడాది సీఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా 1,722 మొబైల్ ఫోన్లు (సుమారు ₹2.75 కోట్ల విలువ) రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సీఈ ఐ ఆర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,169 ఫోన్లు (సుమారు ₹6.67 కోట్ల విలువ) తిరిగి పొందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, సిమ్ బ్లాక్ చేయాలని ప్రజలకు సూచించారు.

డయల్-100 కు 41745 కాల్స్

డయల్ -100కు ఈ సంవత్సరంలో 41745 కాల్స్ రాగా వీటిలో 253 కేసులు నమోదు చేయగా మిగితావి వివిధ విధాలుగా అటెండ్ చేయడం జరిగిందన్నారు.

ఆపరేషన్ స్మైల్/ముష్కాన్

ఆపరేషన్ స్మైల్/ముష్కాన్ లో భాగంగా ఈ సంవత్సరం 18 సం.లోపు బాల కార్మికులుగా పనిచేస్తున్న 108 మందిని గుర్తించి వారి తల్లి తండ్రులకు అప్పగించి తిరిగి వారిని బడిలో చేర్పించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే 14 కేసులు కూడా నమోదు చేశామన్నారు. అలాగే ఆపరేషన్ కవాచ్, పోలీస్ విత్ కిడ్స్ తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు.

వరద సహాయం లో పోలీసులు..

జిల్లాలో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా వెంటనే స్పందించిన పోలీస్ శాఖ సహాయక చర్యలు చేపట్టి 1251 మందిని రక్షించి, 2478 మందిని సురక్షిత ప్రాంతాలు/రిలీఫ్ క్యాంపులకు తరలించడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఎన్‌హెచ్–44 దెబ్బతిని తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకొని వాహనాలను సురక్షిత, క్రమబద్ధమైన రాకపోకలను సాగించినట్లు చెప్పారు.

అంతరాష్ట్ర గ్యాంగ్ ల పట్టివేత

జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదిస్తూ దేశవ్యాప్తంగా విస్తరించిన ముఠాపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 రాష్ట్రాలలో 13 మందిని అరెస్ట్ చేసి, వారిలో 8 మందిపై పీడీ యాక్ట్ అమలు చేయడంతో పాటు భారీగా నకిలీ కరెన్సీ, నగదు, నేరానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరస్తులు సోషల్ మీడియా వేదికగా అమాయకులను మోసం చేస్తూ తక్కువ సమయములో ఎక్కువ మొత్తములో సంపాదించాలనే దురుద్దేశంతో ఈ నేరాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నకిలీ కరెన్సీ వంటి ఆర్థిక నేరాలపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదంతో చర్యలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు.

పార్ది గ్యాంగ్-1 :

దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం 9 రాబరీ కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిలో తరచూ నేరాలకు పాల్పడుతూ సమాజములో భయం నెలకొల్పుతున్న నలుగురుపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగిందన్నారు.

పార్ది గ్యాంగ్- 2:

గత కొంత కాలంగా జాతీయ రహదారులపై ఆగిఉన్న వాహనదారులపై దాడులు చేసి దారి దోపిడీలు, అలాగే గ్రామాల్లో ఇండ్ల దోపిడీలకు పాల్పడుతున్న పార్థి అంతర్రాష్ట్ర దారి దోపిడి ముఠాకు చెందిన నలుగురు నిందితులను గాంధారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.

కంజర్ భట్ గ్యాంగ్ :

భిక్నూర్ మండలం అంతంపల్లి, తలమడ్ల గ్రామ శివార్లలో రాబరీ, దొంగతనాలకు పాల్పడిన కంజర్ భట్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి సుమారు ₹15.45 లక్షల విలువైన దొంగిలించిన ఆస్తి, వాహనాలు మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నమన్నారు.

గడ్డపార గ్యాంగ్ :

గత 5-6 నెలలుగా తాడ్వాయి, గాంధారి, లింగంపేట్, రాజంపేట్, బాన్స్వాడ పరిధిలో ఇళ్లలొ దోపిడీ చేసి ప్రజల భద్రతను భంగం చేసిన గడ్డపార గ్యాంగ్ ఐదుగురు సభ్యులను చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే గే గ్యాంగ్/ సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమాయకులను మోసపూరితంగా బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేయగా వీరు కామారెడ్డి, సిద్ధిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొమ్మిది నేరాలు చేశారన్నారు. వారి వద్ద రూ. 96,350 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రానున్న 2026 సంవత్సరంలో మరిన్ని ఆర్థిక నేరాలు, ఇతర నేరాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపడతామని ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. సమావేశంలో ఏ ఎస్ పి, అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Next Story