కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల కోసం కుట్రలు

by Ratna Kumari |

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్డదారిలో లబ్ది పొందడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు ప్లాన్ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు.

కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల కోసం కుట్రలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్డదారిలో లబ్ది పొందడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు ప్లాన్ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. ఈ విషయం పై దినేష్ పటేల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. ఇందూరు కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేస్తామనే భయంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలు చేస్‌తున్నారని దినేష్ పటేల్ మున్సిపల్ కమిషనర్ కు వివరించారు. కార్పొరేషన్ పరిధిలోని కొత్త ఓటర్ లిస్టు‌లో అనేక అనుమానాస్పద అంశాలున్నాయని దినేష్ పటేల్ కమిషనర్ దృష్టికి తీసుకెల్లారు. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఓటర్ లిస్టులో ‌ చేర్చడం గమనించామని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే వికృత చర్య అని దినేష్ మండిపడ్డారు. ఇందూరు బల్దియా‌పై బీజేపీ జెండా ఎగరకుండా చూడాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు

బల్దియాపై ఎగిరేది బీజేసీ జెండానే..

ప్రజా బలంతో గెలవలేక కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ అన్నారు. ఇందూరు బల్దియాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దినేష్ ధీమాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఓటర్ లిస్ట్ పూర్తిగా తప్పుల తడకగా ఉందని, వెంటనే ఈ తప్‌పులను సరిచేయాలని దినేష్ డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టును ఈసీ సైట్ నుండి డౌన్ లోడ్ చేశానని కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర జిల్లాల వ్యక్తులకు అర్బన్ ఎన్నికల ఓటర్ లిస్టుతో ఎలా సంబంధం ఉంటుందని దినేష్ ప్రశ్నిస్తున్నారు.

సరిచేయకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం..

ఓటర్ లిస్టులో వెలుగు చూసిన తప్పులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, స్పందించి సరిచేయకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని దినేష్ పటేల్ హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీన లోపు ఓటర్ లిస్టును ప్రక్షాళన చేసి అన్ని డివిజన్లలో తలెత్తిన తప్పులను సరిచేయాలని దినేష్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కమిషనర్ ను స్పష్టంగా కోరామన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పారదర్శకమైన, తప్పులేని ఓటర్ లిస్ట్ తయారు చేయాలని డిమాండ్ చేశారు.

క‌లెక్ట‌ర్ అక‌స్మిక బ‌దిలీపై అనుమానాలు

కలెక్టర్ ఉన్న ఫలంగా అకస్మికంగా బదిలీ చేయడం పట్ల కూడా తమకు అనేక అనుమానాలున్నాయని దినేష్‍ అన్నారు. బాగా పనిచేస్తున్న కలెక్టర్ ను అత్యవసరంగా బదిలీ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి..? అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఓటర్ లిస్టులో ఉన్న దొంగ ఓట్లను పూర్తిగా ఏరి వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ విషయంపై నిజామాబాద్ ఎంపీ అర్‌వింద్ ధర్మపురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులు కూడా కమిషనర్ తో ఫోనులో మాట్లాడినట్లు దినేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, కార్యదర్శి దాంపల్లి జ్యోతి, మాజీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు ప్రమోద్,బద్దం కిషన్, ఇప్పకాయల కిషోర్, వినోద్ రెడ్డి, మల్లేష్ గుప్తా, బూరుగుల వినోద్, గడ్డం రాజు, తారక్ వేణు,అంబదాస్,శ్రీనివాస్ రెడ్డి, శంకర్ రెడ్డి, సంతోష్,అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి,భాస్కర్, సందీప్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Next Story