- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
బోధన్ మండలం అమ్దాపూర్ లో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ మండలం అమ్దాపూర్ లో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం.. నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకూడదని, విద్యార్థినులను వారి తల్లిదండ్రులు వస్తేనే వారి వెంట ఇంటికి పంపాలని హితవు పలికారు. తరచూ ఇంటికి వెళ్ళే బాలికల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు పదేపదే ఎందుకు వెళ్తున్నారు అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఇటీవలే బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని నిర్వాహకుల అజాగ్రత్త వల్ల ప్రమాదం బారిన పడి మృతి చెందిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా సంఘటనలకు ఆస్కారం లేకుండా బాలికల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు 8వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాల చుట్టూ తక్షణమే ప్రహారీ గోడ నిర్మాణం జరిపించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చి వేయించాలని, విద్యుత్ వైరింగ్ సరి చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఎంఈఓ నాగయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు ఉన్నారు.






