- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దులలో నిఘా : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ లో 4.37 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలలో ధాన్యం దిగుబడులు వస్తున్నందున ఇప్పటికే జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఈ కేంద్రాలలో ధాన్యం సేకరణ జరిపేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సీజన్ లో 606 కేంద్రాలు ఉండగా, ఈసారి 676 కేంద్రాలను నెలకొల్పుతున్నామని అన్నారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల లోపే ట్యాబ్ ఎంట్రీ జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా, జిల్లాకు 1582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 66.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ధాన్యం సాగు చేసినందున, 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు చేతికందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సుమారు 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు, సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 500 ల చొప్పున బోనస్ అందించనుందని తెలిపారు. బోనస్ అందిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి కూడా సన్న ధాన్యం ఇక్కడికి తరలించి విక్రయించేందుకు పలువురు ప్రయత్నించే అవకాశాలు ఉన్నందున, పొరుగు ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసు శాఖ జిల్లా యంత్రాంగంతో సమన్వయము ఏర్పర్చుకుని సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని సూచించారు.
రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలో వారి ఖాతాలలో బిల్లులకు సంబంధించిన డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, గ్రెయిన్ క్యాలిపర్స్ సరిపడా సంఖ్యలో సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకుని వెంటదివెంట ధాన్యం తూకం జరిగేలా, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు రవాణా జరిగేలా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. ధాన్యం అమ్మకాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు తెలియజేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ తో కూడిన కంట్రోల్ రూమ్ ను నెలకొల్పాలని ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని హితవు పలికారు. పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పని చేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీసీఓ శ్రీనివాస్, డీటీఓ ఉమా మహేశ్వర్ రావు, మార్కెటింగ్ ఏ.డీ గంగవ్వ, తూనికలు కొలతల శాఖ అధికారి సుజాత్ అలీ పాల్గొన్నారు.






