- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారి తప్పుతున్న బాల్యం..
పిల్లల విషయంలో పేరెంట్స్ అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం ఉందని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పబ్జీ ఆడనివ్వడం లేదని దాడి.. ఫోన్ కొనివ్వడం లేదని ఆత్మహత్య.. చిన్నారిపై లైంగికదాడి.. విద్యార్థినులకు వేధింపులు..అర్ధరాత్రి వరకు విందులు.. స్నేహితులతో వినోదాలు..విపరీతమైన స్వేచ్ఛతో నేటి యువతరం పెడదోవ పడుతోంది. తల్లిదండ్రుల అతి గారాభం, ఏం చేసినా నడుస్తుందిలే.. అన్న భావనతో నేరాల వైపు మళ్లుతున్నారు. లేత వయస్సులో మద్యం, డ్రగ్స్, గంజాయికి బానిసవుతూ విలువైన జీవితాన్ని బుగ్గిపాల్జేసుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఆన్‌లైన్ గేమ్స్ పిల్లల జీవితంలో భాగంగా మారిపోయాయి. అవే వారి కొంప ముంచుతున్నాయి. విద్య, విజ్ఞానానికి ఉపయోగపడే ఈ సాంకేతికతను కొందరు పిల్లలు అదుపు లేకుండా వినియోగించడం వల్ల ఆందోళనకర పరిణామాలు కనిపిస్తున్నాయి. పిల్లల ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతూ, కొన్నిసార్లు పిల్లలను నేరాల వైపు అడుగులు పడేలా నడిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా వి(క)నిపిస్తున్న సంఘటనలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని పన్నెండేళ్ల పిల్లాడు చేతికందిన వస్తువుతో తల్లి తల పగల గొడ్డటం, అదే పనిగా మొబైల్ పట్టుకుని గేమ్ లు ఆడుతున్నాడని పేరెంట్స్ ఫోన్ లాక్కుని మందలిస్తే గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం వంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ల్ ఆన్ లైన్ గేమ్ షోలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరమై పిల్లలు అక్కడక్కడా దొంగ తనాలకు పాల్పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
నేర ప్రవృత్తిని అలవాటు చేసుకుంటున్నారో ఆలోచిస్తే..
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన ఓ ఇద్దరు మైనర్ బాలురు అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం చేసి స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఈ ఇద్దరు బాలురు చెరో స్మార్ట్ ఫోన్ వాడుతూ, మీ షో వంటి ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ లలో ఆర్డర్లు బుక్ చేసుకుని జల్సాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి జల్సాలకు ఖర్చు చేసేందుకు డబ్బులు అవసరమై ఆ ఇద్దరు మైనర్ బాలురు దొంగతనాల బాటను ఎంచుకున్నారు. మొదట చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేసే స్థాయికి ఎదిగారంటే పిల్లలు ఎలాంటి వాటికోసం నేర ప్రవృత్తిని అలవాటు చేసుకుంటున్నారో ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో రెండేళ్ల క్రితం ఓ అబ్బాయి స్కూల్ కు వెళ్లకుండా పొద్దంతా మొబైల్ ఫోన్ పట్టుకుని పబ్జీ గేమ్ ఆడుతున్నాడని తల్లి మందలిస్తే గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహ్య చేసుకున్నాడు.. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అధికంగా గేమింగ్, సోషల్ మీడియా, నియంత్రణలేని ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతూ, కొన్నిసార్లు నేరాలకు కూడా దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గేమింగ్ కోసం ఇంట్లోనే దొంగతనాలు
మొబైల్ ఫోన్లలో ఆన్ లైన్ గేమ్స్ కొనుగోలు చేయడానికి చదువుకునే పిల్లలు తమ ఇళ్లలోనే పేరెంట్స్ దాచుకున్న డబ్బులను దొంగిలిస్తున్నారు. మొదట ఆటగా ప్రారంభమైన అలవాటు, తరువాత డబ్బు లకోసం అబద్ధాలు చెప్పడం, దొంగతనాలకు పాల్పడే స్థాయికి చేరిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైన్ స్నాచర్లలో కొందరు చిన్న తనంలో చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉండేదని, ఆర్థిక అవసరాలు పెరిగిన దృష్ట్యా చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నట్లు పోలిసుల విచారణలో వెల్లడించిన సందర్బాలున్నాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు అనేక గంటలు గేమ్స్ ఆడే పిల్లల్లో చిరాకు, కోపం, ఏకాగ్రత లోపం, సామాజిక సంబంధాల నుంచి దూరం కావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, వారు ఎప్పుడు ఏ విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారో అంచనా వేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. గేమింగ్‌కు అలవాటు పడిన పిల్లలు చదువుపై ఆసక్తి కోల్పోవడం, కుటుంబ సభ్యులతో ఘర్షణలకు దిగడం కూడా జరుగుతోంది. ఇలాంటి పిల్లల్లో మార్పు రావాలంటే పిల్లల మొబైల్ వినియోగానికి పేరెంట్స్ సమయ పరిమితులు విధించి పక్కాగా అమలు చేయాలి. వారు స్మార్ట్ ఫోన్ లో చూసే కంటెంట్ పైన, ఆడే గేమ్స్ పైన పర్యవేక్షణ ఉండాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా ప్రోత్సహించాలి. పిల్లలో ప్రవర్తనలో అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ అందించాలని నిపుణలు సూచిస్తున్నారు. సాంకేతికత శాపం కాదని, నియంత్రణలేని వినియోగమే ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల పట్ల తల్లిదండ్రులే కీలకంగా పని చేయాలి.
సోషల్ మీడియా ప్రభావంతో ప్రమాదకర చర్యలు
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రైల్వే ట్రాక్‌లపై వీడియోలు తీయడం, ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ను వేగంగా బైక్ నడుపుతూ రీల్స్ చేయడం, ప్రమాదకర స్టంట్లు ప్రదర్శించడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి. వీటిలో కొన్నిఅలవాట్లు మనుషుల ప్రాణనష్టానికి కూడా దారితీస్తున్నాయి. గుర్తింపు కోసం చేసే ఈ ప్రయత్నాలు చట్టపరమైన సమస్యలకు కూడా కారణమవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
సైబర్ నేరాల్లో బాలల ప్రమేయం..
స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడే అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సోషల్ మీడియాలో మోసపూరితమైన నకిలీ ఖాతాలు సృష్టించడం, ఇతరుల ఫోటోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగ పర్చడం వంటివి జరుగుతున్నాయి. తెలిసి కొందరు, తెలియక కొందరు ఆన్‌లైన్ మోసాలకు సహకరించడం వంటి సైబర్ నేరాల్లో కూడా కొంతమంది బాలలు చిక్కుకుంటున్నారని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి విషయాన్ని అనుకరించడం వల్ల చట్టపరమైన పరిణామాలపై అవగాహన లేకుండానే నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి.






