సింగిల్ విండోలో గందరగోళం.. 103 బస్తాల యూరియా మాయం

by Kodari Anjali |

మాచారెడ్డి వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో)లో జరిగిన పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సింగిల్ విండోలో గందరగోళం.. 103 బస్తాల యూరియా మాయం
X

మాచారెడ్డి సింగిల్ విండోలో ఏకంగా 103బస్తాల యూరియా మాయమవ్వడం సొసైటీ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ డిజిటల్ ఫర్టిలైజర్ యాప్‌లో రైతులు తీసుకోకుండానే యూరియా పంపిణీ అయినట్లు తప్పుడు రికార్డులు నమోదయ్యాయి. యాప్ గందరగోళం వల్ల 25మంది నిజమైన రైతులకు ఎరువులు అందకపోవడంతో పంపిణీ వ్యవస్థపై అనుమానాలు వస్తున్నాయి. అక్రమాల నేపథ్యంలో చైర్మన్, సీఈఓ మధ్య విభేదాలు ముదిరి, యూరియా మాయం కాకముందే కార్యదర్శి లీవ్‌లో వెళ్లారు. సింగిల్ విండోలో నెలకొన్న గందరగోళం మధ్యే కార్యదర్శిని, సేల్స్‌మెన్‌ను తొలగిస్తూ పాలకవర్గం వరుసగా తీర్మానాలు చేసింది. డిజిటల్ రికార్డులకే ద్రోహం చేసిన నేపథ్యంలో మ్యానువల్‌గా పంపిణీ చేసిన పచ్చిరొట్ట విత్తనాల లెక్కలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల స్టోర్ రూమ్ తెరిచి చూడగా దొరికిన అదనపు ఎరువుల బస్తాలపై ప్రశ్నిస్తే ఆ లెక్క సీఈఓకే తెలుసని సేల్స్‌మెన్ దాటవేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సహకార, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, మాచారెడ్డి: మాచారెడ్డి వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో)లో జరిగిన పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ అమలవుతున్న ఈ సంఘంలో వరుస ఆరోపణల దుమారం రేగుతోంది. సొసైటీకి వచ్చిన నిల్వల్లో ఏకంగా 103 బస్తాల యూరియా లెక్క తేలడం లేదు. యాప్‌లో రైతులు తీసుకోకుండానే పంపిణీ అయినట్లు నమోదవ్వడం, మరోవైపు 25మంది నిజమైన రైతులకు యూరియా అందకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. స్టాక్ రిజిస్టర్, యాప్ రికార్డులకు పొంతన లేకపోవడంతో సింగిల్ విండో వ్యవహారం అంతా గజిబిజి గందరగోళంగా మారింది.

పాలకవర్గం వర్సెస్ సీఈఓ...

ఈ అక్రమాల నేపథ్యంలో సంఘంలో పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టింది. గతంలో చైర్మన్ వర్సెస్ డైరెక్టర్ల మధ్య నడిచిన గొడవలు కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదు వరకు వెళ్లాయి. అవి కాస్త సర్దుమణిగాక, ఇప్పుడు పాలకవర్గం వర్సెస్ సీఈఓ (కార్యదర్శి)గా వ్యవహారం సాగుతోంది. చైర్మన్, కార్యదర్శి మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాల వల్లే ఈ సమస్యలు తలెత్తాయనే చర్చ జరుగుతోంది. యూరియా మాయం కావడం కంటే ముందే కార్యదర్శి సెలవుపై వెళ్లడం ఈ విభేదాలను తేటతెల్లం చేస్తోంది. ఈ క్రమంలోనే కార్యదర్శిని, ఆ తర్వాత సేల్స్‌మెన్‌ను తొలగిస్తూ పాలకవర్గం వరుస తీర్మానాలు చేయడం గమనార్హం.

పచ్చిరొట్ట విత్తనాల మాటేమిటి?..

డిజిటల్ యాప్ లావాదేవీల్లోనే ఇంత గందరగోళం సృష్టించిన మహానుభావులు.. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మ్యానువల్‌గా పంపిణీ చేసిన పచ్చిరొట్ట ఎరువు విత్తనాల లెక్కలను సరిగ్గా ఉంచారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూరియా మాదిరిగా ఇవి కూడా పక్కదారి పట్టాయా? లేక ఎవరైనా ఉద్దెర ఖాతాలు పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాలకవర్గ సభ్యులు స్టోర్ రూమ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు యూరియా బస్తాలు, టార్పాలిన్ కవర్లు, వివిధ రకాల ఎరువులు, భూసారాన్ని పెంచే న్యూట్రీషన్లు దర్శనమిచ్చాయి. అక్కడ దొరికిన యూరియా ఎక్కడిదని ప్రశ్నిస్తే.. ఆ లెక్క సీఈఓకే తెలుసని సేల్స్‌మెన్ చెప్పడం గమనార్హం.

సమగ్ర విచారణకు డిమాండ్..

యూరియా నిల్వల వ్యత్యాసంపై జిల్లా సహకార అధికారి (డీసీఓ) వచ్చి విచారణ జరిపి సేల్స్‌మెన్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు. అయినప్పటికీ, స్టోర్ రూమ్‌లో దొరికిన ప్రతి వస్తువుకు లెక్క తేలాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కోసం రూపొందించిన డిజిటల్ వ్యవస్థపై కమ్ముకున్న అనుమానాల మేఘాలు తొలగాలంటే జిల్లా సహకార, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా సమగ్ర విచారణ జరపాలి. యాప్ డేటా, గోదాం నిల్వలు, ఆర్థిక లావాదేవీలను సరిపోల్చి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story