మారిన రిజర్వేషన్లు.. మారుతున్న సమీకరణాలు!

by I. Sairam |

ఎల్లారెడ్డి పురపాలక సంఘంలో ఎన్నికల యుద్ధానికి తెర లేచింది.

మారిన రిజర్వేషన్లు.. మారుతున్న సమీకరణాలు!
X

దిశ, తాడ్వాయి (ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి పురపాలక సంఘంలో ఎన్నికల యుద్ధానికి తెర లేచింది. తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 13,265మంది ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి చైర్మన్ పీఠంపై కన్నేసిన హేమాహేమీలు ఇప్పటికే వార్డుల్లో తిష్టవేసి ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహిళా ఓటరే మహారాణి...

ఈసారి ఎల్లారెడ్డి ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మహిళా ఓటర్ల ప్రాబల్యం. ఇక్కడ పురుష ఓటర్లు 6,321మంది కాగా, మహిళా ఓటర్లు 6,943మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలే 622మంది అదనంగా ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ఏ అభ్యర్థి గెలవాలన్నా మహిళా ఓటర్ల మద్దతు తప్పనిసరి అని స్పష్టమవుతోంది. అందుకే ప్రధాన పార్టీలు మహిళా సంఘాలను, గృహిణులను ఆకట్టుకునేందుకు వినూత్న హామీలతో ముందుకు వెళ్తున్నాయి.

మారిన రిజర్వేషన్లు.. పెరిగిన ఉత్కంఠ

గతంలో బీసీ వర్గానికి కేటాయించిన మున్సిపల్ చైర్మన్ పదవి, ఈసారి జనరల్ కేటగిరీకి దక్కడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తమకే టికెట్ దక్కుతుందని ఆశిస్తున్న నాయకులు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కూడా కొందరు సిద్ధమవుతుండడం పార్టీల అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

ప్రచారంలో జోరు.. హామీల హోరు

వార్డుల వారీగా సమస్యల చిట్టా సిద్ధం చేసుకున్న అభ్యర్థులు ఓటర్ల ముంగిటకు వెళ్తున్నారు. గతంలో జరగని విధంగా పట్టణ సుందరీకరణ చేస్తున్నామని, గత రెండేళ్లలో మంజూరైన సుమారు రూ.14కోట్ల అభివృద్ధి నిధులే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలంగా మారాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొంటున్నారు. పెద్దచెరువు వద్ద నిర్మిస్తున్న పార్కు, కొత్త బస్టాండ్ ఆధునీకరణ పనులు గెలుపును నిర్ణయిస్తాయని హస్తం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, పారిశుధ్య లోపాలను ఎత్తిచూపుతూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు.

మహిళా, యువ ఓటర్లదే నిర్ణయాత్మక శక్తి..

మొత్తానికి ఎల్లారెడ్డి పురపోరు మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారనుంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ, అంతిమంగా ఓటరు దేవుడు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

ఎల్లారెడ్డి పురపాలక సంఘం గణాంకాలు..

మొత్తం వార్డులు : 12

మొత్తం ఓటర్లు : 13,265

మహిళా ఓటర్లు : 6,943

పురుష ఓటర్లు: 6,321

Next Story