బీజేపీలో సగం మంది సిట్టింగ్ లకు టికెట్లు హుష్ పటాక్

by Malleboina Mahesh |

వార్డుల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఎక్కడ కలిసి వస్తే అక్కడే పోటీ అన్న ఆలోచనతో దృష్టి పెట్టి పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటూ.. మరో పక్క ఎన్నికల ఖర్చుల నిమిత్తం నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు.

బీజేపీలో సగం మంది సిట్టింగ్ లకు టికెట్లు హుష్ పటాక్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వార్డుల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఎక్కడ కలిసి వస్తే అక్కడే పోటీ అన్న ఆలోచనతో దృష్టి పెట్టి పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటూ.. మరో పక్క ఎన్నికల ఖర్చుల నిమిత్తం నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పార్టీ తరఫున బరిలో దింపేందుకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. తాజా మాజీ కార్పొరేటర్లలో సగానికి పైగా కార్పొరేటర్లకు ఈసారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లలో సగం మందికి పైగా టికెట్లు దక్కవని విశ్వసనీయంగా తెలుస్తోంది. కిందటిసారి తృటిలో చేజార్చుకున్న కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఈసారి కచ్చితంగా దక్కించుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీని ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్ గా ఎన్నికల బరిలో దిగేందుకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందనే విషయంపై సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తు వేసే విధంగా అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ వ్యూహ రచనలు చేస్తుంది.

ఆరు నూరైనా ఈసారి జెండా కాషాయ ఎగరేయాల్సిందే..

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా ఈసారి దక్కించుకోవాలని, ఇందూరు బల్దియాపై కాషాయం జెండాను ఎగరేయాలనే ధృఢ సంకల్పంతో ఎంపీ అర్వింద్ ధర్మపురి తన పూర్తి ఫోకస్ ను నిజామాబాద్ కార్పొరేషన్ పైనే కేంద్రీకృతం చేశారు. కార్పొరేషన్ లోని 60 డివిజన్లను ఏ మాత్రం ఆషామాషీగా తీసుకోకుండా అన్ని డివిజన్లలో పూర్తి సర్వే చేయించారు. బీజేపీ కార్పొరేటర్ టికెట్ రేసులో ఉన్న ఆశావహుల్లో ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారు. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయాలున్నాయి? వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటు వారి ప్రీవియస్ హిస్టరీ వంటి అనేక అంశాలపై రకరకాలుగా విశ్వసనీయ ఏజెన్సీల ద్వారా సర్వే జరిపించిన అర్వింద్ ధర్మపురి.

సర్వే రిపోర్ట్ ఆధారంగా తను కూడా స్వీయ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్లలో చాలా మంది పనితీరుపై ఆయా డివిజన్లలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సర్వే నివేదికలు చెపుతున్నట్లు సమాచారం. దీంతో మరో సారి కూడా సర్వే చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ సీట్లు సాధించి కార్పొరేషన్ మేయర్ సీటు దక్కించుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పేలా లేవని ఎంపీ అర్వింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజా మాజీ కార్పొరేటర్లలో సగం మందికి టికెట్లు దక్కే పరిస్థితులు లేవని విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం.

అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిజామాబాద్

ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాం కదా అని, గెలిచాక డబ్బుల కోసం ప్రజలను పీడించొద్దని, మేయర్ గా గెలిచాక ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ కార్పొరేషన్ లో అవినీతి ఉండొద్దని ఎంపీ అర్వింద్ పార్టీలోని ఆశావహులకు గట్టిగా చెపుతున్నట్లు పార్టీ నాయకులంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ గెలిచాక కార్పొరేషన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని చెపుతున్నట్లు సమాచారం. అవినీతికి అడ్డాగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ ను బీజేపీ గెలుచుకుని అవినీతి రహిత కార్పొరేషన్ మార్చుదామని, ప్రజలను పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేద్దామని ఎంపీ అర్వింద్ ఆశావహులకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతున్నట్లు పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

Next Story