- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాణ్యమైన చేప పిల్లలతో మత్స్య కార్మికులకు మెరుగైన ఉపాధి : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025 - 2026 సంవత్సరానికి వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి, బరువును తూకం వేస్తూ, ఒక్కోటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ చెరువులో బొచ్చ, రోహు, బంగారు తీగ జాతికి చెందిన 1,14,600 చేప పిల్లలు వదలడం జరిగిందని వివరించారు. ప్రతి చోట చెరువులు, ఇతర జలాశయాలలో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హితవు పలికారు.
నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే చేప పిల్లలు కేటాయించబడినాయా? లేదా? అన్నది జాగ్రత్తగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఎక్కడైనా తేడా జరిగినా, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఉన్నా, వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. చెరువులలో వదులుతున్న ప్రతి చేప పిల్ల బతికేలా నాణ్యమైన చేప విత్తనాలను ఉత్త్పత్తి చేయిస్తున్నామని అన్నారు. నాణ్యమైన చేప పిల్లలను పెంచినట్లయితే మత్స్యకారుల ఉపాధి అవకాశాలు బాగుంటాయనే ఉద్దేశ్యంతో అన్ని దశలలోనూ పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, మత్య్స కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.






