న్యాయం కోసం ఇద్దరు పిల్లలతో భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు

by Ratna Kumari |

న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించిన సంఘటన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

న్యాయం కోసం ఇద్దరు పిల్లలతో భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు
X

దిశ, నిజాంసాగర్ : న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించిన సంఘటన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామానికి చెందిన కావ్య జీవితంలో వివాహానంతరం ఎదురైన సమస్యలు తీవ్ర ఆవేదనకు దారి తీశాయి. ఇద్దరు చిన్నారులతో కలిసి ఆమె న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు బైఠాయించడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పోచాగౌడ్, అంబవ్వల దంపతుల ఒక్కగానొక్క కుమార్తె అయిన కావ్యను 2020లో బూర్గుల్ గ్రామానికి చెందిన మహేందర్ గౌడ్‌తో వివాహం చేశారు. కుటుంబం శక్తిమేరకు కట్న కానుకలు సమర్పించినప్పటికీ, వివాహానంతరం ఆమెకు అత్తింట్లో సమస్యలు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 2023లో గర్భిణిగా ఉన్న సమయంలో ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి వెళ్లిన కావ్యకు కవల పిల్లలు జన్మించారు.

ఆ తర్వాత ఆమెను అత్తమామలు తిరిగి ఇంట్లోకి అనుమతించక పోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. పలుమార్లు భర్త ఇంటికి వెళ్లి ప్రయత్నించినా ప్రతి సారి నిరాకరణే ఎదురైనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై గ్రామ పెద్దల సమక్షంలో పలు పంచాయతీలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదని సమాచారం. తన భర్త సహకారంగా ఉన్నప్పటికీ అత్తమామల వైఖరి కారణంగా గృహంలో స్థానం లేకుండా పోయిందని కావ్య వాపోయింది. ప్రస్తుతం ఆమె భర్త మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నివాసం ఉంటుండడంతో న్యాయం కోరుతూ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఇద్దరు చిన్నారులతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగింది. తనకు, తన పిల్లలకు గౌరవప్రదమైన జీవితం కావాలనే ఆశతో కావ్య చేస్తున్న పోరాటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story