- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబోయ్.. ఆ తిట్లు భరించలేం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో వార్డు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలుగా పోటీ చేసిన బాలవ్వ అనే మహిళ తన ప్రత్యర్థుల కన్నా తక్కువ ఓట్లు రావడంతో ఓటమి పాలైంది. దీంతో ఆగ్రహానికి గురైన బాలవ్వ తన వార్డులోని ఓటర్లందరి ఇళ్ల ముందుకు వెళ్లి దుర్భాషలాడుతూ తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు తిడుతోందని గ్రామంలోని మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బాలవ్వ ఇంటి ముందు గురువారం ధర్నాకు దిగారు. ఎలక్షన్ లో బాలవ్వ పంపిణీ చేసిన బీరు బాటిళ్లు, కల్లు ఫ్యాకెట్లు తిరిగిచ్చేస్తున్నామని, మళ్లీ మమ్మల్ని అనవసరంగా తిట్టకూడదంటూ నిరసనకు దిగారు. ఈ విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో తాము ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన సందర్భాలున్నాయి. కానీ ఏకంగా మద్యం బాటిళ్లు, కల్లు పాకెట్లు తీసుకుని కూడా ఓటేయలేదంటూ మహిళలను బండ బూతులు తిట్టిన ఓ మహిళ విషయం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. బాలవ్వ తిడుతున్న బండ బూతులను వినలేక, భరించలేక మహిళలంతా బీరు బాటిళ్లు కొని తెచ్చి ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేయడంతో ఉప్పల్వాయి గ్రామం వార్తల్లో నిలిచింది. ఓటు కోసం తమ వద్దకు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడిన బాలవ్వ ఓడిపోగానే తన ఓటమికి మేమే కారణమంటూ కొందరినే టార్గెట్ చేసి తిడుతోందని మహిళలు వాపోయారు. తను పంపిణీ చేసిన మద్యం బాటిళ్లు, కల్లు ఫ్యాకెట్లు ఆమెకు తిరిగిచ్చేస్తున్నామని, మమ్మల్ని మళ్లీ తిడితే ఊరుకునేది లేదని బాలవ్వను మహిళలు గట్టిగా హెచ్చరించారు.






