- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికల్లో కుల సంఘాలదే పెత్తనం.. తాయిలాలతో ఒప్పందాలు
గ్రామ పంచాయతీల ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో స్థానిక సందడి జోరందుకుంది.

దిశ, తాడ్వాయి : గ్రామ పంచాయతీల ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో స్థానిక సందడి జోరందుకుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పోటీ చేయాలనుకొనే ఆశావహులు మద్దతు కూడగట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. తమ వర్గాలు, గ్రూపులను పోగేసుకోవడంతో పాటు తమ ప్రాతినిధ్యాన్ని బలపర్చాలని ముఖ్య కార్యకర్తలు, అనుచరులను కోరుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో కొందరు అభ్యర్థులు తమ భార్యలను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆయా పార్టీల పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఊరిలో అధికారం చెలాయించవచ్చనే భావనతో ఎంతో మంది సర్పంచ్ పీఠంపై కన్నేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కామారెడ్డి రెవెన్యూ డివిజన్ లోని అన్ని గ్రామ పంచాయతీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ఎవరికివారు పావులు కదుపుతున్నారు. సంవత్సరాలుగా ఈ పదవి కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆశావహులు ఈసారి ఎలాగైనా సర్పంచ్ గిరిని కైవసం చేసుకునేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు.
కుల సమీకరణాల చుట్టూ రాజకీయం
ప్రస్తుతం ఆశావహులు దృష్టి అంతా కుల సంఘాలపైనే కేంద్రీకృతమైంది. గ్రామాల్లోని వివిధ కుల సంఘాలను ఏకం చేసే పనిలో వారు చురుగ్గా ఉన్నారు. ముఖ్యంగా కుల సంఘాల సభ్యుల్లో ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు తారుమారు ప్రయత్నాలు మొదలయ్యాయి.
తాయిలాలతో ఒప్పందాలు
ఆశావహులు వ్యక్తిగత లాభాల కోసం, సంఘాల మద్దతు కోసం ఏ మాత్రం వెనుకాడకుండా తాయిలాలు సమర్పించుకుంటూ ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో,గ్రామ పంచాయతీల్లో సాయంత్రం అయిందంటే చాలు.. ఈ ఆశావహుల ప్రయత్నాలు మరింత ఊపందుకుంటున్నాయి.నేతలు తమ అనుచరులతో కలిసి మందు, విందు,మంతనాలు, సంప్రదింపులు జరుపుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.
సర్పంచ్ సాబ్ పతార కోసం ఎంతైనా ఖర్చు
ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ సాబ్ అనే పతారా పొందడం కోసం భూములు తనక పెట్టి మరి పైసలు ఎన్ని అయినా ఖర్చు పెట్టేందుకు కూడా ఆశావహులు వెనుకాడటం లేదు.ఈ విధంగా, గ్రామ స్థాయిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడే కొద్దీ ఈ రాజకీయ సమీకరణాలు మరింతగా మారుతాయని,మరింత ఆసక్తి చెందే విషయాలు జరుగుతాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






