- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం
పాత అప్పులు ఎగ్గొట్టడంతో పాటు అడ్డదారిలో త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ ప్రముఖ వ్యాపారవేత్తను అక్రమ తుపాకీతో కిడ్నాప్ చేసేందుకు వ్యూహం రచించిన అంతరాష్ట్ర ముఠా కుట్రను కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీసులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు.

దిశ, తాడ్వాయి : పాత అప్పులు ఎగ్గొట్టడంతో పాటు అడ్డదారిలో త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ ప్రముఖ వ్యాపారవేత్తను అక్రమ తుపాకీతో కిడ్నాప్ చేసేందుకు వ్యూహం రచించిన అంతరాష్ట్ర ముఠా కుట్రను కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీసులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరితో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి ఒక అక్రమ ఫైర్ ఆర్మ్ (తుపాకీ), రబ్బర్ బుల్లెట్లు, నైలాన్ తాడు, మంకి క్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన వ్యాపారవేత్త భూస శ్రీనివాస్‌తో నిందితులైన నిట్టు నర్సింగా రావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామిలకు గతంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. శ్రీనివాస్ వద్ద భారీగా నగదు ఉందని గ్రహించిన నిందితులు.. ఎలాగైనా అతడిని కిడ్నాప్ చేసి, భయపెట్టి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలని.. తద్వారా పాత బాకీలు కూడా తీర్చకుండా తప్పించుకోవచ్చని ప్లాన్ వేశారు.
మహారాష్ట్ర నుంచి తుపాకీ కొనుగోలు..
వ్యాపారవేత్తను బెదిరించడానికి ఆయుధం కావాలని భావించిన ఏ1 నిందితుడు నర్సింగ రావు, వడ్డే స్వామి కలిసి మహారాష్ట్రలోని తమకు తెలిసిన అజయ్, వైభవ్‌లను సంప్రదించారు. వారి ద్వారా నామ్‌గావ్‌కు చెందిన మారుతి ఘోకే అనే వ్యక్తి వద్ద రూ. 30,000 కు తుపాకీ ఒప్పందం కుదుర్చుకుని, రూ. 27,000 అడ్వాన్స్ చెల్లించారు. ఈ క్రమంలో బుధవారం (మే 27న) మహారాష్ట్ర ముఠా ఆ తుపాకీని స్థానిక నిందితులకు అప్పగించేందుకు కృష్ణాజీవాడి గ్రామ శివాలయం సమీపానికి చేరుకుంది. ఆ ప్రాంతంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తూ నేరానికి పన్నాగం పన్నుతున్నారనే నమ్మదగిన సమాచారంతో తాడ్వాయి ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతున్న ఆరుగురిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో ఈ భారీ కిడ్నాప్ కుట్ర వెలుగుచూసింది. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సీఐ సంతోష్ కుమార్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీ యాదగిరి, సీసీఎస్ సిబ్బంది మైసయ్య, కిషన్‌లతో కూడిన ప్రత్యేక బృందం కేసును ఛేదించింది. అరెస్టయిన వారిలో చిట్యాల గ్రామానికి చెందిన నిట్టు నర్సింగా రావు (A1) సంతాయిపేటకు చెందిన సూర స్వామి అలియాస్ వడ్డె స్వామి (A2), పులి ప్రశాంత్ గౌడ్ (A3), చిట్యాలకు చెందిన సురం స్వామి (A4) లతో పాటు మహారాష్ట్రకు చెందిన వైభవ్ ప్రకాశ్ బరాడేవర్ (A5), అజయ్ హన్మంత రావ్ గోంగపాలే (A6) ఉన్నారు. ప్రధాన ఆయుధ సరఫరాదారు మారుతి ఘోకే పరారీలో ఉన్నాడు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
ఒక నల్ల రంగు ఫైర్ ఆర్మ్, 5 రబ్బర్ బుల్లెట్లు, 2 ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు, 5 మొబైల్ ఫోన్లు, ఒక స్ప్లెండర్ బైక్, 2 మంకీ క్యాప్స్, 3 మాస్కులు, నైలాన్ తాడు, పసుపు టేప్, రూ. 3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 61(2), ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 3, 4, 25(1AA) ప్రకారం.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






