కౌంటింగ్ షురూ.. కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

by Naga Rani Yarlagadda |

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవిష్యత్ ఏంటో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తేలిపోనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా.. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కౌంటింగ్ షురూ.. కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం, పార్టీల ప్రాభవం ఏంటో నేడు తెలిసిపోనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు ఈనెల 11 న ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల భవితవ్యం ఏంటనేది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8గంటల నుండి ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఈనెల 11 న ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్సులన్నీ సీజ్ చేసి అదే రోజు స్ట్రాంగ్ రూంలకు తరలించారు. స్ట్రాంగ్ రూం ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను పూర్తి స్థాయిలో పోలీసుల రక్షణ వలయంలో ఉంచారు. ఎన్నికల అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూంల నుంచి బ్యాలెట్ బాక్సులను కేటాయించిన డివిజన్లు, వార్డుల వారీగా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళతారు. అక్కడ అధికారులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు తెరిచి వారి సమక్షంలోనే కౌంటింగ్ సిబ్బంది ఓట్లను కట్టలు కడతారు. అటు తరువాత ఓట్లను లెక్క కడతారు.

నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్వై జర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానం గురించి కీలక సూచనలు చేశారు. అదేవిధంగా బోధన్ లోని విజయ మేరీ హైస్కూల్ లో కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను సైతం కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున ఎంతో జాగ్రత్తతో బాధ్యతాయుతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరపాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, సొంత నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురి కాకూడదని, ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించుకుని వెల్లడించాలని సూచించారు. కౌంటింగ్ హాలు లోనికి ఆర్.ఓ మినహా ఇతరులు ఎవరికీ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సమయ పాలన పాటిస్తూ కౌంటింగ్ విధులకు సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు.

కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే

నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ మున్సిపాలిటీ ఓట్లను బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్ మున్సిపల్ ఓట్లను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీమ్ గల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ను భీమ్ గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ఉదయాన్నే 8 గంటలకు కౌంటింగ్ హాల్స్ కు చేరనున్న బ్యాలెట్ బాక్సులు

శుక్రవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్ ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తారు. 8 గంటల నుండి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్నివిధాలుగా సన్నద్ధం చేశామని ఆమె తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించామన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.

డివిజన్ కు ఒక్క కౌంటింగ్ టేబుల్

అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు. ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లలో 25 ఓట్ల చొప్పున బండిల్స్ గా విభజించి కట్టలు కడతారు. ఒక్కో రౌండ్ లో వెయ్యి చొప్పున ఓట్లను లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో కూడా ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొప్పున కౌంటింగ్ టేబుల్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.

రిజర్వ్ లో అదనపు కౌంటింగ్ సిబ్బంది

ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సిబ్బందితో పాటు అవసరమైన పక్షంలో వారి సేవను ఉపయోగించుకోవడానికి అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్ లో ఉంచారు. కౌంటింగ్ హాలులో ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ను కూడా నియమించామన్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోలైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం అదనపు సిబ్బందిని సైతం రిజర్వ్ లో ఉంచామన్నారు.

ఉదయం 7 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు..

అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు వారికి సూచించబడిన సమయానికి ఉదయం 7 గంటల లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని కలెక్టర్ సూచించగా.. కౌంటింగ్ సిబ్బంది అంతా ఎంట్రీ పాసులు, గుర్తింపు కార్డులతో కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని కలెక్టర్ ఆమె స్పష్టం చేశారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను పూర్తి చేశామని, సిబ్బందికి అల్పాహారం, భోజనాలను కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ కౌంటింగ్ సిబ్బందికి హితవు పలికారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వద్ద అవసరమైన మేర సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు.

Next Story