- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాట్లుగా పచ్చని పొలాలు.. రియల్ ఎస్టేట్ విస్తరణతో క్షీణిస్తున్న వ్యవసాయం
తాడ్వాయి మండలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల విస్తరణతో పచ్చని పంట పొలాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో గ్రామీణ యువత నగరాల వైపు వలస వెళ్తోంది.

తాడ్వాయి మండలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల విస్తరణతో పచ్చని పంట పొలాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ కావడంతో గ్రామీణ యువత నగరాల వైపు వలస వెళ్తోంది. పల్లెల్లో కేవలం వృద్ధులు, కూలీలు మాత్రమే మిగులుతుండడంతో సాగు చేసే తరం క్రమంగా తగ్గిపోతోంది. నాయకుల పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుంటే, రైతుల పిల్లలు గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్లాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ, గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రచార ఆర్భాటాలే తప్పా, రైతు సంక్షేమ హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పంటను అమ్ముకుందామన్నా కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఛార్జీలు, తరుగు పేరుతో అన్నదాత దోపిడీకి గురవుతున్నాడు. వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఎంత డబ్బున్నా ఆహారం దొరకని దుస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
- దిశ, తాడ్వాయి
దిశ, తాడ్వాయి : ఒకప్పుడు పచ్చని పంటలతో, పక్షుల కిలకిలారావాలతో సందడిగా కనిపించిన గ్రామాలు నేడు క్రమంగా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్నాయి. పట్టణీకరణ ప్రభావంతో వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మార్గం చూపుతున్నాయి. ఎటు చూసినా ప్లాట్లు, సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి తప్ప, రాబోయే తరాలకు ఆహారం అందించే పచ్చని పంట పొలాలు కనుమరుగవుతున్నాయి. ‘రైతు రాజు’ అన్న మాటలు ఉట్టివేనని, అన్నదాతకు గౌరవం అందని ద్రాక్షగా మారిందని గ్రామీణులు వాపోతున్నారు. భవిష్యత్తులో తినడానికి తిండి దొరకని రోజులొస్తాయా అని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పల్లెల్లో వెలితి.. పట్టణాలకే యువత పరుగులు..
గ్రామీణ యువత వ్యవసాయాన్ని భవిష్యత్తు లేని రంగంగా భావిస్తోంది. కష్టం ఎక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా రావడంతో చిన్నా పెద్దా ఉద్యోగాల కోసం పట్టణాలు, నగరాల వైపు వలస వెళుతోంది. దీంతో గ్రామాల్లో వృద్ధులు, కూలీ పనులు చేసేవారే మిగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న తరం క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
విదేశాల్లో నాయకుల పిల్లలు.. వలస పోతున్న రైతు బిడ్డలు..
సమాజంలో పెరుగుతున్న అసమానతలకు నాయకులు, రైతుల పిల్లల జీవితాలే స్పష్టమైన ఉదాహరణ. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉన్నత విద్య కోసం, ఐటీ ఉద్యోగాల పేరుతో విదేశాల్లో స్థిరపడుతుంటే రైతులు, కూలీల పిల్లలు మాత్రం బతుకుదెరువు కోసం దుబాయ్, గల్ఫ్ వంటి ఎడారి దేశాలకు వెళ్తున్నారు. భూమి ఉన్నా సాగు చేయలేని పరిస్థితులు, అప్పుల భారంతో గ్రామీణ యువత పొలాలకు దూరమవుతూ ఉపాధి కోసం వలస పోవాల్సి వస్తోంది.
ఆరుగాలం శ్రమ.. అయినా నష్టాలే..
రైతు జీవితం ఎప్పుడూ అనిశ్చితితో నిండిందే. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రకృతితో పోరాటం తప్పని పరిస్థితి. పంట బాగానే పండినా సరైన కొనుగోలుదారులు లేకపోవడం, దళారుల దోపిడీ, గిట్టుబాటు ధరలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలు రైతును మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
పథకాలు భారీగా.. ప్రయోజనాలు శూన్యం..
ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్నికలు జరుగుతున్నా రైతు సంక్షేమం మాత్రం మాటల్లోనే మిగులుతోంది. తాము గెలిస్తే రైతు రాజ్యం తీసుకొస్తామని ప్రతి రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలుకు నోచుకోవడం లేదు. రైతులకు మేలు చేసే కార్యక్రమాల కంటే ప్రచార ఆర్భాటాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లో కొత్త దోపిడీ..
కష్టాలన్నీ దాటుకుని పంట పండించి ధాన్నాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతుకు అక్కడ మరో సమస్య ఎదురవుతోంది. హమాలి ఛార్జీలు, తరుగు పేర్లతో రైతుల నుంచి ముక్కుపిండి అదనంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గిట్టుబాటు ధర దక్కకపోయినా, కనీసం తెచ్చిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇలాంటి దోపిడీని భరించక తప్పడం లేదు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతే తన హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది?, కార్పొరేట్ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్న పాలకులు, దేశానికి వెన్నెముకైన రైతు సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? రైతు కన్నీరు పెడుతుంటే ఏం పట్టనట్లు మౌనంగా ఎందుకుంటున్నారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు, సమాజం మేల్కొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎంత డబ్బున్నా ఆహారం దొరకని పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.






