నందిపేట్‌లో కల్తీ కుంభకోణం!

by Nallavelli.Anjaneyulu |

నందిపేట్ మండల కేంద్రం ప్రస్తుతం కల్తీ కేంద్రమా? అనే ప్రశ్నలు రేకెత్తించే పరిస్థితికి చేరుకుంది.

నందిపేట్‌లో కల్తీ కుంభకోణం!
X

దిశ, నందిపేట్ : నందిపేట్ మండల కేంద్రం ప్రస్తుతం కల్తీ కేంద్రమా? అనే ప్రశ్నలు రేకెత్తించే పరిస్థితికి చేరుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహార వ్యాపారాలు ఇప్పుడు విషపూరిత కేంద్రాలుగా మారుతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తీపి పానీయాలు, జ్యూస్ సెంటర్లు, లస్సీ దుకాణాలు, హోటళ్లు, పాల కేంద్రాలు, ఏదీ మినహాయింపు లేకుండా కల్తీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జ్యూస్, తీపి పానీయాలు విక్రయించే దుకాణాలపై మరింత తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిపోయిన పండ్లు, నాసిరకం ఫలాలతో జ్యూసులు తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారనే వార్తలు ప్రజల్లో ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి.

బయటకు ఆకర్షణీయంగా కనిపించే ఈ పానీయాల వెనుక ఉన్న అసలు పరిస్థితి ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది. ఈ విధంగా తయారవుతున్న జ్యూసులు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. లాభాల కోసం కొందరు వ్యాపారులు నాసిరకం పదార్థాలు వాడుతూ ప్రజల ఆరోగ్యంతో నేరుగా ఆటలాడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలో వాడుతున్న నూనెల పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని సమాచారం. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, చౌక నాసిరకం ఆయిల్స్ కలపడం వంటి అక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాల కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పాలలో నీరు కలపడం మాత్రమే కాదు.. రసాయనాల కల్తీ కూడా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లలు, వృద్ధులు ఉపయోగించే పాలు కూడా భద్రంగా లేవన్న అనుమానం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆందోళనకర విషయంలో అధికారుల మౌనం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, తనిఖీలు జరగకపోవడం, చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. “ఇది నిర్లక్ష్యమా? లేక ఎవరినో కాపాడే ప్రయత్నమా?” అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, సంబంధిత శాఖలు మాత్రం కళ్ళు మూసుకుని కూర్చోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. కల్తీ వ్యాపారాలు బహిరంగంగానే సాగుతున్నా, వాటిపై ఒక్క కఠిన చర్య కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. ఇప్ప‌టికైనా అధికారులు మేల్కొని, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ “కల్తీ కలకలం” మరింత ప్రమాదకరంగా మారి, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. ప్ర‌జ‌ల ప్రాణాల కంటే లాభాల‌కే ప్రాధాన్య‌త ఇస్తారా..? అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూద్దాం.

Next Story