- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు జారీ అయ్యేలా తెలంగాణ మీడియా అకాడమీ చిత్త శుద్ధితో కృషి చేస్తోందని అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు జారీ అయ్యేలా తెలంగాణ మీడియా అకాడమీ చిత్త శుద్ధితో కృషి చేస్తోందని అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని భరోసా కల్పించారు. నిజామాబాద్ నగర ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వెల్ నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, జర్నలిస్టులకు లాంఛనంగా కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ నాలుగో విడత సమావేశం గురువారం జరగనుందని తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల అభ్యర్థనల మేరకు అక్రిడిటేషన్ల జారీ కోసం ఉద్దేశించిన 252 జీఓలో అవసరమైన సవరణలు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అర్హులైన వారందరికీ తప్పనిసరిగా అక్రిడిటేషన్లు జారీ అవుతాయని అన్నారు.
స్పోర్ట్స్ జర్నలిస్ట్ లు, కార్టూనిస్టులు, ఫిలిం, కల్చరల్ జర్నలిస్టులకు కూడా కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మీడియా అకాడమీ చర్యలు తీసుకుందని అన్నారు. సర్క్యులేషన్ ప్రాతిపదికన కార్డులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో జారీ చేస్తారని చెప్పారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రిడిటేషన్లు జారీ కాకుండా చూడాలన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయని, ఇదివరకటి తరహాలోనే ఈసారి కూడా కార్డులు జారీ చేయబడతాయని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో భేటీ ఉందని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చి హెల్త్ కార్డులు అందించిన వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్యాన్ని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితా రెడ్డి, డీపీఆర్ఓ పద్మశ్రీ, వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు అసద్ ఖాన్, ముబీన్ పటేల్, భార్గవ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, సుభాష్, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.






