మూడు మండలాలకు ఒకే సింగిల్ విండో..!

by Kodari Anjali |

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను జిల్లాలను మండలాలను, గ్రామాలను వికేంద్రీకరణ చేశారు.

మూడు మండలాలకు ఒకే సింగిల్ విండో..!
X

దిశ, మాచారెడ్డి: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను జిల్లాలను మండలాలను, గ్రామాలను వికేంద్రీకరణ చేశారు. కానీ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి, పాల్వంచ మూడు మండలాలకు కలిపి ఒకే సింగిల్ విండో ఉండడం వింత గొలుపుతుంది. అదీ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మొహ్మద్ అలీ షబ్బీర్ సొంత మండల కేంద్రంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు వికేంద్రీకరణకు నోచుకోగా సహకార వ్యవస్థ మాత్రం నోచుకోలేదు. మూడు మండలాలకు చెందిన వేలాది మంది రైతులకు ఒకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) సేవలు అందించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల పరిధిలోని మొత్తం 44 గ్రామ పంచాయతీలకు ఒకటే సింగిల్ విండో కొనసాగుతుండటం సహకార వ్యవస్థకు విరుద్ధంగా మారిందని రైతులు విమర్శిస్తున్నారు.

వికేంద్రీకరణ ప్రతిపాదనలకే పరిమితమా?

పరిపాలన సౌలభ్యం కోసం పాలకవర్గాలు వికేంద్రీకరణ కోసం పలుమార్లు పంపినా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ ప్రకారం మండలానికి రెండు సింగిల్ విండోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం పాల్వంచ మండలంలో రెండు మాచారెడ్డి మండలంలో రెండు చొప్పున ప్రతిపాదనలు పంపారు. కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు.

నాలుగు నుంచి ఒకటిగా మారిన వైనం

సహకార వ్యవస్థ ఆరంభంలో సేవలను గ్రామాలకు చేరువ చేసేందుకు నాలుగు సొసైటీలను ఏర్పాటు చేశారు. అన్నారం, రెడ్డిపేట, సోమారంపేట, వెల్పుగొండ ప్రాంతాల్లో సింగిల్ విండోలు నెలకొల్పారు. జనాభా పెరిగిన కొద్దీ విస్తరణకు బదులు మాచారెడ్డి మండలంలో సహకార వ్యవస్థను కుదించి మాచారెడ్డికే పరిమితం చేశారు. ప్రస్తుతం ఈ సంఘంలో 5,400 మంది రైతులు సభ్యులుగా ఉండగా, 1,200 మందికి పంట రుణాలు, 45 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చారు. కొత్తగా రుణాలు ఇవ్వడమే బంద్ చేశారు.

లైసెన్స్ కేంద్రాల ద్వారా సేవలు

వికేంద్రీకరణ జరుగకపోవడంతో సహకార సేవలు రైతులకు అందడం లేదని భావించిన పాలకవర్గాలు లైసెన్స్ కేంద్రాల ఏర్పాటు ద్వారా సేవలను సులభతరం చేశారు. ప్రస్తుతం సంఘం పరిధిలో 10 లైసెన్స్ కేంద్రాలు మాచారెడ్డి, లచ్చాపేట, సోమారంపేట, ఎల్లంపేట, వెల్పుగొండ, ఆరేపల్లి, సింగరాయపల్లి, భవానిపేట, ఫర్దీపేట తదితర ప్రాంతాల్లో ఎరువుల విక్రయాలు కొనసాగుతున్నాయి.

వడ్ల కొనుగోలు కేంద్రాలే ఆదాయం

సొసైటీలకు ఆదాయ మార్గాలన్నీ బందైపోయాయి. ప్రభుత్వం నుంచి ఏ గ్రాంటు రావడం లేదు. రైతుల వాటాదనం ఫిక్స్డ్ డిపాజిట్లకు పోగా లావాదేవీలకు ఆస్కారం లేకుండా పోయింది. కేవలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మాచారెడ్డి, చుక్కాపూర్, ఘన్‌పూర్, లచ్చాపేట, అన్నారం, వెల్పుగొండ, భవానిపేట, ఆరేపల్లి, పాల్వంచ ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం ద్వారా సంఘానికి ఆదాయం సమకూరుతోంది. ఈ కొనుగోలు కేంద్రాల ఆదాయంతో రైతులకు సేవలు విస్తరించేందుకు లచ్చాపేట, బంజేపల్లి, ఫర్దీపేట, ఆరేపల్లి, భవానిపేట ప్రాంతాల్లో ఒక్కో గోదాం, ఎల్లంపేటలో రెండు గోదాములు నిర్మించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు వెచ్చించారు. అదేవిధంగా రూ.80 లక్షలతో ఆఫీస్ కమ్ కమర్షియల్ భవనం నిర్మించగా, అందులో రూ.50 లక్షలు బ్యాంకు రుణంగా తీసుకున్నారు. సంఘానికి ప్రస్తుతం రూ.2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతటి ఆర్థిక సామర్థ్యం, రైతుల సంఖ్య ఉన్నప్పటికీ వికేంద్రీకరణ జరగకపోవడం, మూడు మండలాలకు ఒకే సింగిల్ విండో కొనసాగడం, రైతులకు సేవలు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే కొత్త సింగిల్ విండోలను ఏర్పాటు చేసి సహకార సేవలను గ్రామస్థాయికి విస్తరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story