అప్పుల ఊబిలో కూలీ.. పురుగుల మందు తాగి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

అప్పుల బాధ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబంలో విషాదం నింపింది.

అప్పుల ఊబిలో కూలీ.. పురుగుల మందు తాగి ఆత్మహత్య
X

దిశ, ​లింగంపేట : అప్పుల బాధ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబంలో విషాదం నింపింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మార్తం సిద్దిరాములు (37) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజువారీ వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో గత కొంతకాలంగా సుమారు 2 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు.పెరిగిన అప్పులు, తీర్చే మార్గం కనిపించకపోవడంతో సిద్దిరాములు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.​

ఈ క్రమంలో ఈ నెల 11న మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక శక్తి లేకపోవడం, పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం బాధితుడిని ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సిద్దిరాములు మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు మహిశ్వరి, మేఘన ఉన్నారు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని మృతితో ఆ కుటుంబం వీధిన పడటం చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Next Story