- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేకేవై రహదారి పై చిరుత పులి షికారు
మెంగారం గ్రామ సమీపంలోని కేకేవై రహదారి ప్రస్తుతం మృత్యుమార్గంగా మారింది. ఈ దారిలో చిరుత పులి షికారు చేస్తోంది.

దిశ, తాడ్వాయి (లింగంపేట) : మెంగారం గ్రామ సమీపంలోని కేకేవై రహదారి ప్రస్తుతం మృత్యుమార్గంగా మారింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులి, తాజాగా మంగళవారం తెల్లవారుజామున మెంగారం గ్రామ శివారులోని కేకేవై ప్రధాన రహదారి పై వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ మార్గంగా ప్రయాణించే వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిలువునా వణికిపోయిన వాహనదారులు కేకేవై రహదారి పక్కన ఓ వాహనంలో ప్రయాణిస్తున్న వారికి రోడ్డు పై చిరుత పొంచి ఉండటం కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు చిరుతను చూసి వాహనాలను వెనక్కి తిప్పుకుంటున్నారు. ఎప్పుడు, ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆ మార్గంలో వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.
అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
లింగంపేట, తాడ్వాయి మండలాల్లో చిరుత సంచారం కొత్తేమీ కాదు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారుల్లో తిరుగుతూ లేగదూడలు, పశువులను పొట్టనబెట్టుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ, అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలు, వ్యవసాయ పొలాల సమీపంలో చిరుత పులి సంచరిస్తున్నా గస్తీ ఏర్పాటు చేయకపోవడం, ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని స్థానికులు విమర్శిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచారం గురించి వార్తలు వస్తున్నప్పటికీ అధికారులు రవంత స్పందన కూడా చూపడం లేదని వాపోతున్నారు. పశువుల ప్రాణాలు పోయినా పట్టించుకోని అధికారులు, ఇప్పుడు మనుషుల ప్రాణాల మీదకు వచ్చే వరకు వేచి చూస్తారా ? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి నష్టం జరగకముందే చిరుతను పట్టుకొని ప్రజలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.






