కట్టుతప్పుతున్న యువతరం..! క్షణికావేశంతో వరుస ఆత్మహత్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-22 01:53:05  IST  )

యువతంటే మార్పును ఆశించే నవతరం.

కట్టుతప్పుతున్న యువతరం..! క్షణికావేశంతో వరుస ఆత్మహత్యలు
X

యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసలై కొందరు పెడదోవ పడుతున్నారు. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని కష్టపడుతున్నారు. మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లకు, మందుకు, డ్రగ్స్ కు అలవాటై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో మత్తువైపునకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం కూడా పట్టించుకోక పోవడంతో విద్యార్థుల గతి తప్పుతుంది. ఫోన్‌ చేతిలో ఉంటే సమస్తం ఉన్నట్లే. సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఒక కారణమైంది. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థుల చదువుల పేరిట సెల్‌ఫోన్‌ వాడడం సాధారణమైంది. సినిమాలు, సెల్‌ఫోన్ల వినియోగంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

దిశ, భిక్కనూరు: కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కావాలని.. అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసి, రూ. లక్షలు ఖర్చు చేసి పెద్ద చదువులు చదివిస్తే.. చెడు వ్యాసనాల బారిన పడి.. అడ్డదారులు తొక్కుతున్నారు. కన్న తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొస్తున్న ఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. పిల్లలు చేసే తప్పిదాలకు పేరెంట్స్ పరువు బజారున పడుతుండడంతో, పిల్లలను ఏమీ అనలేక, సొసైటీలో తలెత్తుకుని తిరగలేక కొందరు తల్లిదండ్రులు లోలోపల మానసిక వేధనకు గురవుతున్నారు. చిన్నప్పటినుంచే పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని, వారికి తగ్గట్టుగా నడుచుకునే కుటుంబాలెన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల బలహీనతలను క్యాచ్ చేసుకుని కొందరు పిల్లలు చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. వారి లైఫ్ ను చేజేతులా దెబ్బ నాశనం చేసుకుంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పెట్టుకున్న ఆశలను అడియాసలు చేస్తూ, పుత్ర శోకాన్ని కలిగిస్తున్నారు.

కోప్పడితే చాలు..

తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఎవరైనా సుతిమెత్తగా మందలించినా, సంయమనం కోల్పోయి పిల్లలపై కోప్పడినా ఇంట్లో గొడవకు దిగి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఆవేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి నిండుజీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు. చాలా మంది పేరెంట్స్ ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఏమీ అనలేక, ఏం చేయాలో పాలుపోక మానసిక వేధనను అనుభవిస్తూ సైలెంట్ గా భరిస్తున్నారు. ఎదిగిన పిల్లలు కొందరు తల్లిదండ్రులను సరిగా గౌరవించకపోవడం, వారు చెప్పిన మాటలను వినకుండా, మొండిగా వ్వహరిస్తూ తమకేది నచ్చితే అది చేస్తూ పోతున్నారు. తప్పుడు మార్గంలో వెళుతున్నారు. పశ్చాత్తాపంతో కొందరు తమ మనసులోని బాధలను, సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక మధన పడుతూ మానసిక సంఘర్షణను తట్టుకోలేక క్షణికావేశంలో చోటుచేసుకుంటున్న సూసైడ్ ఘటనలెన్నో వెలుగు చూస్తున్నాయి. పిల్లలను మందలిస్తే ఏమవుతుందోననే భయంతో భరిస్తున్నారు. ఎలా ఉన్నా మన కళ్ల ముందు కనిపిస్తే చాలు.. అనే భావనతో పిల్లలను ఏమీ అనలేక వదిలేస్తున్నారు.

కారణాలు ఇవేనా..?

పిల్లలు దారి తప్పడానికి, క్షణికావేశానికి గురై విపరీత నిర్ణయాలు తీసుకోవడానికి కారణం వారు చిన్న తనం నుండి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తనే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్ననాడు పిల్లలు దేని కోసమైనా మారాం చేయగానే ఏదడిగితే అది కొనిపెట్టడంతో, పెరిగి పెద్దయ్యాక కూడా అదే పద్ధతలు అలవడుతున్నాయని మానసిక నిపుణలు చెపుతున్నారు. ఖరీదైన బైకులు, మొబైల్ ఫోన్లు కొనివ్వడం కూడా పిల్లలు చెడిపోవడానికి కారణమంటున్నారు. స్కూళ్లలో చదివే పిల్లలు తప్పు చేస్తే టీచర్లు మందలించిన సందర్భాల్లో కొందరు పేరెంట్స్ పిల్లల ముందే టీచర్లను బెదిరించడం, గట్టిగా నిలదీయడం చేస్తున్నారు. ఇది పిల్లలు చెడిపోవడానికి కారణంగా మారుతోంది. తాము తప్పు చేసినా పేరెంట్స్ సమర్ధిస్తారనే సంకేతాలు వెళ్లడంతో పిల్లలు రెచ్చిపోతున్నారు.

వరుస ఘటనలతో భయం..

చెడు వ్యసనాల బారిన పడిన యువత కొందరు క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఉమ్మడి నిజామామాబాద్ జిల్లాలో జరిగాయి. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 10 మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఐదుగురు యువకులు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసులకు, పరువుకు భయపడి, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లకుండానే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని మేనేజ్ చేసుకొని కవర్ చేశారు. మరి కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి..

చిన్ననాటి నుండే తల్లిదండ్రులు పిల్లలను పెంచే పద్ధతిలో మార్పు రావాలి. పిల్లలకు చిన్న తనం నుండే వాస్తవాల్లో బతికే అలవాటును నేర్పించాలి. లేని పోని ఆడంబరాలకు వారిని అలవాటు చేయకుండా ఉన్నంతలో జీవించే పద్ధతులను అలవాటు చేయాలి. పిల్లలతో తల్లిదండ్రులు సరదాగా, స్నేహ పూర్వకంగా ఉంటూ వారి మధ్య ఏ విషయాన్నైనా చర్చించుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులే క్రియేట్ చేయాలి. పొరపాటుగా పిల్లలేమైనా తెలియక తప్పు చేస్తే క్షమించి మంచి మార్గాన్ని చూపుతారనే నమ్మకాన్ని పిల్లల్లో కలిగించాలి. ఇలాంటి పద్ధతుల్లో పేరెంట్స్ పిల్లలను పెంచితే చాలా సమస్యలు దూరమవుతాయని మానసిక నిపుణులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Next Story