Nizamabad: ఎట్టకేలకు పసుపు బోర్డు.. పసుపు రైతు ఖుష్

by Ramesh Goud |

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు ఎట్టకేలకు మంజూరైంది.

Nizamabad: ఎట్టకేలకు పసుపు బోర్డు.. పసుపు రైతు ఖుష్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు ఎట్టకేలకు మంజూరైంది. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లా(Nizamabad District) లో ఈ ప్రతిష్టాత్మక టర్మరిక్ బోర్డు(Turmeric Board) ఏర్పాటు అవుతుండడం గమనార్హం. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఢిల్లీలో రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించారు. దీంతో నిజామాబాద్ తర్వాత అత్యధికంగా పసుపు పండించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతోంది.

నేడు లాంచనంగా ప్రారంభం

నేషనల్ టర్మరిక్ బోర్డు ను కేంద్ర పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం లాంచనంగా ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో పసుపు బోర్డును ఆయన ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నిజామాబాద్ జిల్లాకే చెందిన పసుపు బోర్డు పోరాట రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సుదీర్ఘకాలంగా బోర్డును కచ్చితంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రధానమంత్రి చేత ప్రకటింపజేయడంతో ఎంపీ ధర్మపురి అరవింద్ కు రాజకీయంగా విపరీతమైన మైలేజీ రానుంది. నిజామాబాద్ జిల్లాలో టర్మరిక్ బోర్డు ఏర్పాటు పట్ల ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జీ నగేష్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు లు హర్షం వ్యక్తం చేశారు.

బోర్డు ఏర్పాటుతో భారీగా ప్రయోజనాలు..

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా రైతాంగానికి భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. నిజామాబాద్ జిల్లా తర్వాత అత్యధికంగా పసుపు పండించే జిల్లాగా నిర్మల్ కు పేరు ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ పసుపు పంటను గణనీయంగానే పండిస్తారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక సుమారు 20 నుండి 30 వేలకు పైగా ఎకరాల్లో పసుపు పండిస్తారు. పసుపు పండించే రైతులు పంటను అమ్ముకునేందుకు అనేక అవస్థలు పడేవారు. గతంలో నిజామాబాద్ మార్కెట్ కు తరలించి అమ్మినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర దక్కేది కాదు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ తీసుకువెళ్లి అన్ని పరిస్థితి ఉండేది. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుతో నిర్మల్ లోనే భారీ మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి రానంది. నిర్మల్ తో పాటు బైంసా, ఖానాపూర్ బోత్ ఆదిలాబాద్ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పసుపు విత్తన శుద్ధి కర్మాగారాలు, కోల్డ్ స్టోరేజీలు, ఇతర పసుపు సంబంధిత పరిశ్రమలు భారీగా ఏర్పాటు అయ్యే వీలుంది. ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా పసుపు పండించే దేశాల్లో ఒకటైన భారత్ 62 శాతం మేర విదేశాలకు పసుపు ఎగుమతులు చేస్తున్నది. దీంతో ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పసుపు ఆదారిత ఆయుష్ మందుల పరిశ్రమలు, ఫార్మసిటికల్ కంపెనీలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్నింటికీ మించి రైతులు పండించే పసుపు ధర ఖరారు విషయంలో స్థానిక జాతీయ పసుపు బోర్డు ఖరారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు గణనీయంగా లాభపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు సంతోషంతో ఉన్నారు.

Next Story