కర్నూల్ బస్సు ప్రమాదం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ కామెంట్స్

by Prasad Jukanti |

బస్సుల్లో అగ్నిప్రమాదాలపై నితిన్ గడ్కరీ సీరియస్ కామెంట్స్ చేశారు.

కర్నూల్ బస్సు ప్రమాదం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్‍ బస్సులుగా మారుస్తూ బస్ కోడ్ ఉల్లంఘిస్తే అలాంటి వారిని ఇకపై నేరుగా జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హెచ్చరించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కోడ్‍లో స్పష్టమైన నిబంధనలు చేర్చామన్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల కర్నూల్ జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదంపై (Kurnool bus fire) స్పందించారు. ఈ ఘనటలో 19 మంది చనిపోయారని ఆ బస్సు చట్ట విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు అసలు రిజిస్ట్రేషన్ సీటర్ కోచ్‍గా ఉంటే దానిని స్లీపర్ కోచ్‍గా మార్చారని ఈ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 1, 2025 నుండి అమలు చేయబడిన సవరించిన బస్ కోడ్‍లో అనేక కఠిన నిబంధనలు ఉన్నాయని అవి అన్ని బస్సులకు వర్తిస్తుందని గడ్కరీ తెలిపారు. ఆ కోడ్ ప్రకారం తయారైన బస్సులు అగ్నిప్రమాదాలకు గురికావన్నారు. దేశంలోని అన్ని బస్సులు ఇక ఈ కొత్త బస్ కోడ్‍కు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కాగా అక్టోబర్‌లో భారతదేశంలో రెండు పెద్ద బస్సు అగ్నిప్రమాదాలు సంభవించారు. వాటిలో ఒకటి కర్నూల్ దుర్ఘటన కాగా మరొకటి రాజస్థాన్‍లో సంభవించింది. ఈ రెండు యాక్సిడెంట్స్ లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల బస్ కోడ్ లలో కేంద్రం ముఖ్యమైన సవరణలు చేసింది. AIS 052, AIS 153, మరియు AIS 119 ప్రమాణాల్లో మార్పులు చేసింది. AIS 153 కోడ్ లో బస్సుల నిర్మాణానికి సంబంధించిన అదనపు భద్రతా ప్రమాణాలు, AIS 052 కోడ్ లో బస్ బాడీ రూపకల్పన, ఆమోదం, AIS 119 కోడ్ లో అగ్ని నిరోధకత, పొగ సాంద్రత, మండే స్వభావం ఉన్న పదార్థాలకు సంబంధించి పేర్కొన్నారు. ఈ మార్పులు పూర్తిగా అమల్లోకి వస్తే భవిష్యత్తులో బస్సు అగ్నిప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story