తెలంగాణ రవాణా సంస్కరణలపై నితిన్ గడ్కరీ ప్రశంసలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ రవాణా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ రవాణా సంస్కరణలపై నితిన్ గడ్కరీ ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన ఒక లేఖ రాశారు. తెలంగాణలో రవాణా రంగం అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను గడ్కరీ అభినందించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్ పోస్టుల రద్దు నిర్ణయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. దీనివల్ల రవాణా వ్యవస్థలో అవినీతి తగ్గి, వేగం పెరుగుతుందని పేర్కొన్నారు.

వాహన్, సారథి వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా అనుసంధానం చేయడంపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించడం ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేస్తున్న తీరును కొనియాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి, సుస్థిర రవాణా వ్యవస్థ కోసం పడుతున్న శ్రమ అభినందనీయమని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా తెలంగాణలో సంస్కరణలు సాగుతున్నాయని ఆయన ప్రశంసించారు.

Next Story