- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిరందాస్ శ్రీనివాస్‌కు 'జీవిత సాఫల్య పురస్కారం'.. కాకర్ల సుబ్బారావు శతజయంతి వేళ అరుదైన గౌరవం
రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎన్నో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, రోగ నిర్ధారణ ఖచ్చితత్వం, వేగం పెరగడం వల్ల రోగికి అతి త్వరలో వైద్య చికిత్స అందుతుందని నిమ్స్ డైరెక్టర్ డా.నగరి బీరప్ప అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రోగ నిర్ధారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎన్నో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, రోగ నిర్ధారణ ఖచ్చితత్వం, వేగం పెరగడం వల్ల రోగికి అతి త్వరలో వైద్య చికిత్స అందుతుందని నిమ్స్ డైరెక్టర్ డా.నగరి బీరప్ప అన్నారు. పద్మశ్రీ ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు జాతీయ సదస్సు నిమ్స్ ట్రామా ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిమ్స్ దేశంలోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ యంత్ర పరికరాలతో అత్యున్నత సేవలు అందిస్తుందని తెలిపారు. సంస్థలో రేడియాలజీలో డిజిటల్ ఎక్స్ రే మెషీన్లు, మల్టీ డిటెక్టర్ సిటీ, ఎంఆర్ఐ, మామోగ్రఫీ, డెక్సా స్కాన్, సీఆర్ములు, ఆల్ట్రాసౌండ్ మెషీన్లు, అధునాతన డీఎస్ఏ లాబ్ అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో నాలుగు తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలు (TIMS) ఏర్పాటుతో 4000 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. నిమ్స్‌లో అదనంగా 2000 బెడ్స్, ఉస్మానియా, కాకతీయ ఆసుపత్రుల్లో మరో 3000 బెడ్స్ తో వైద్య అనుబంధ ప్రొఫెషనల్స్‌కి ఎన్నో ఉద్యోగాలు రానున్నాయని అభిప్రాయపడ్డారు. కాకర్ల సుబ్బారావు తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక వైద్య విధానాన్ని, ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను విస్తరించడానికి ఆయన చేసిన కృషి అమోఘం, ఆయన కృషిని సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ తెలంగాణ చాప్టర్ ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాకర్ల శత జయంతి సందర్భంగా జీవిత సాఫల్య అవార్డును నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్, రేడియాలజీ ఇమేజింగ్/థెరప్యూటిక్ ప్రొఫెషనల్స్ జాతీయ మండలి అధ్యక్షుడు శిరందాస్ శ్రీనివాస్ కి అవార్డును ప్రకటించడం గర్వకారణం అన్నారు. శ్రీనివాస్ ఆ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు.
రేడియాలజీ కీలకం..
ప్రస్తుతం రేడియాలజీ విభాగం ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని రోగ నిర్ధారణలో కీలక భూమిక పోషిస్తుందని రేడియాలజీ విభాగం అధిపతి డా.ఎస్.రామ్మూర్తి చెప్పారు. వివిధ రకాల యంత్ర పరికరాలు వాటిని రోగ నిర్ధారణకు ఉపయోగించడానికి సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు వారు అప్డేట్ కావడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగ పడతాయని, అందుకు కృషి చేస్తున్న సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ కృషి అభినందనీయమన్నారు. అందులో కీలక భూమిక పోషిస్తున్న శ్రీనివాస్, దామోదర నాయుడు కృషి అభినందనీయమన్నారు. కాకర్ల సుబ్బారావు రేడియాలజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి డా.ఎన్.కవితారెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఈ అవార్డుకు అన్ని విధాల అర్హుడు అని, గత ముప్పై ఏండ్లుగా ఆయన కృషికి ఇది గుర్తింపుగా కొనియాడారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ జాతీయ అధ్యక్షులు శంకర్ కె భగత్ మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ ఏర్పాటుకు తాము గత నలభై ఏండ్లుగా పోరాడుతున్నామన్నారు. నలభై ఏండ్ల జాతీయ కమిషన్ కల నేడు నెరవేరడమే కాకుండా రేడియాలజీ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడిగా తమ సంస్థ సీఈఓ శిరందాస్ శ్రీనివాస్ ను కేంద్ర ప్రభుత్వం నియమించడం గర్వ కారణంగా చెప్పారు. కార్యక్రమంలో సర్ చైర్మన్ కే మునిరత్నం, అకడమిక్ డైరెక్టర్, కెఎస్ఆర్ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ కే. దామోదర నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం.ఏ. వారిస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మహేష్ బసవేని పాల్గొన్నారు. సదస్సులో దేశం నలు మూలల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కు చెందిన విద్యార్థి చెరుకూరి ధనుష్ అందుకున్నారు. ఈ అవార్డ్ కింద నగదు, ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగినది.






