నిమ్స్‌లో తొలిసారిగా అరుదైన చికిత్స.. సిద్ధిపేట మహిళకు పునర్జన్మ

by Naga Rani Yarlagadda |

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు.

నిమ్స్‌లో తొలిసారిగా అరుదైన చికిత్స.. సిద్ధిపేట మహిళకు పునర్జన్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. వాస్క్యులర్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత అత్యాధునికమైన యాంజియోజోట్ ఫార్మా కో-మెకానికల్ థ్రోంబెక్టమీ విధానాన్ని ఉపయోగించి, అక్యూట్ డీప్ వీన్ థ్రోంబోసిస్ (అక్యూట్ డీవీటీ) వ్యాధితో బాధపడుతున్న మహిళకు విజయవంతంగా చికిత్స అందించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామానికి చెందిన కొలిచేల్మి రజినీ (39) అనే మహిళకు ఈ అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

డీప్ వీన్ థ్రోంబోసిస్ అంటే ఏమిటి?

డీప్ వీన్ థ్రోంబోసిస్ (డీవీటీ) అనేది కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే అత్యంత తీవ్రమైన వ్యాధి. దీనికి సకాలంలో సరైన చికిత్స అందించకపోతే, ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు చేరి పల్మనరీ ఎంబోలిజంగా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

యాంజియోజోట్ చికిత్స ప్రత్యేకత..

ఈ అత్యాధునిక విధానంలో ముందుగా రక్తం గడ్డకట్టిన ప్రాంతంలోకి నేరుగా ప్రత్యేక ఔషధాలను పంపి గడ్డను కరిగిస్తారు. ఆ తర్వాత యాంజియోజోట్ పరికరం సహాయంతో అత్యంత వేగంగా ఆ గడ్డను పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల కాళ్లలో రక్తప్రసరణ తక్షణమే పునరుద్ధరించబడి రోగి వేగంగా కోలుకుంటారు. అంతేకాకుండా భవిష్యత్తులో కాళ్ల వాపులు, తీవ్రమైన నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు.

ఉచితంగా కార్పొరేట్ వైద్యం..

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సను పేద రోగికి ఆరోగ్యశ్రీ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఇలాంటి ఖరీదైన, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను సామాన్యులకు ఉచితంగా అందించడం నిమ్స్ యాజమాన్యానికి ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వాస్క్యులర్ సర్జరీ హెచ్ఓడీ డా. సందీప్ మహాపాత్రతో పాటు డా. అనూష, డా. అరుణశ్రీ, డా. ఊహ, డా. శ్రీనిధి, డా. సుదర్శన్, డా. అమర్‌నాథ్, డా. త్రివిక్రమ్, డా. కీర్తన, డా. నలిన్ కృష్ణ, డా. నరేన్ బృందాన్ని డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story