దేశంలో తొలి ప్రభుత్వ క్యాన్సర్ జెనెటిక్ హబ్‌గా నిమ్స్.. ఒకే పరీక్షతో 52 జన్యువుల గుర్తింపు

by Ramesh Naini |

ప్రభుత్వ రంగంలోనే దేశంలోనే తొలిసారిగా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అత్యాధునిక క్యాన్సర్ జెనెటిక్ పరీక్షల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.

దేశంలో తొలి ప్రభుత్వ క్యాన్సర్ జెనెటిక్ హబ్‌గా నిమ్స్.. ఒకే పరీక్షతో 52 జన్యువుల గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ రంగంలోనే దేశంలోనే తొలిసారిగా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అత్యాధునిక క్యాన్సర్ జెనెటిక్ పరీక్షల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఐసీఎంఆర్ - డైమాండ్‌ ఎస్ పథకం కింద నిమ్స్ పాథాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 25 కేంద్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక కేంద్రం నిమ్స్ మాత్రమే. ఈ కేంద్రంలో ప్రవేశపెట్టిన నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) సాంకేతికత ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన డీఎన్ఏ, ఆర్‌ఎన్‌ఏ మార్పులను ప్రారంభ దశలోనే ఖచ్చితంగా గుర్తించి, రోగులకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సను అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

పాత పద్ధతి స్థానంలో సరికొత్త ఎన్జీఎస్..

గతంలో నిమ్స్‌లో అందుబాటులో ఉన్న పీసీఆర్ సాంకేతికత ద్వారా ఒకసారి ఒకటో రెండో జెనెటిక్ లోపాలను మాత్రమే పరీక్షించే వీలుండేది. ఆ పాత పద్ధతిలోనే 2024 నుంచి ఇప్పటివరకు 1,443 మంది రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు నిమ్స్ ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. అయితే, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్జీఎస్ టెక్నాలజీ ద్వారా ఒకే ఒక్క శాంపిల్‌తో ఏకంగా 52 రకాల క్యాన్సర్ జన్యువుల (52 జీన్ ప్యానల్) లోపాలను ఒకేసారి అత్యంత ఖచ్చితంగా గుర్తించవచ్చునని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంత వీర్ జి. ఉప్పిన్ దిశకు వెల్లడించారు.

నెల రోజుల ట్రయల్ రన్ సక్సెస్!

ఈ అత్యంత ఖరీదైన, సంక్లిష్టమైన సరికొత్త టెక్నాలజీని గత నెల రోజులుగా నిమ్స్‌లో ట్రయల్ రన్ (టెస్టింగ్ వాలిడేషన్) నిర్వహించి, 28 మంది రోగులపై విజయవంతంగా పరీక్షలు పూర్తి చేశారు. పరీక్షల ఫలితాలపై పూర్తి ఖచ్చితత్వం, క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ సేవలను ఇప్పుడు అధికారికంగా ప్రజల్లోకి తెచ్చినట్లు డాక్టర్ శాంత వీర్ వివరించారు.

ఆర్థిక తారతమ్యాల్లేవు.. అందరికీ ఫ్రీ!

ప్రైవేట్ ల్యాబ్‌లలో ఈ ఎన్జీఎస్ పరీక్ష చేయించుకోవాలంటే వ్యాధి తీవ్రతను బట్టి కనీసం రూ. 25,000 నుండి లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్) ఉన్న రోగులందరికీ ఎలాంటి సామాజిక, ఆర్థిక తారతమ్యాలు లేకుండా (నిమ్స్ ఇన్-పేషెంట్లయినా, బయటి ఆసుపత్రుల వారైనా సరే) ఈ ఖరీదైన పరీక్షను పూర్తి ఉచితంగా చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

త్వరలో లిక్విడ్ బయాప్సీ..

భవిష్యత్తులో డీహెచ్ఆర్-ఐసీఎంఆర్ అనుమతులతో మరిన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఈ ఉచిత ఎన్జీఎస్ సేవలను విస్తరిస్తామని నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్ప తెలిపారు. అలాగే, కేవలం సాధారణ రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించడానికి, వ్యాధి పురోగతిని పర్యవేక్షించడానికి ఉపయోగపడే ‘లిక్విడ్ బయాప్సీ’ పరీక్షను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అత్యాధునిక కేంద్రంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల పేద క్యాన్సర్ రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందనుంది.

Next Story