కిడ్నీ బాధితులకు నిమ్స్ భరోసా.. 2 వేల ట్రాన్స్‌ప్లాంటేషన్స్

by Malleboina Mahesh |

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇందులో 95% మందికి ఉచితంగా వైద్యం అందింది.

కిడ్నీ బాధితులకు నిమ్స్ భరోసా.. 2 వేల ట్రాన్స్‌ప్లాంటేషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. నిమ్స్ యూరాలజీ విభాగం విజయవంతంగా 2000 కిడ్నీ (మూత్రపిండాలు) మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి, దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఒకటిగా సరికొత్త రికార్డు సృష్టించింది.

1989లో శ్రీకారం.. నేడు అగ్రస్థానం

నిమ్స్‌లో 1989లో మొదటి శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాగుతున్న ఈ వైద్య యజ్ఞంలో నాణ్యత, నైపుణ్యం జోడై నేడు దేశంలోనే అత్యంత విజయవంతమైన ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమంగా నిలిచింది. 1989 నుంచి 2010 వరకు నిమ్స్‌లో 448 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించగా, 2011 నుంచి జూన్ 2017 వరకు మరో 552 శస్త్రచికిత్సలు జరిగాయి. అనంతరం జూన్ 2017 నుంచి జనవరి 2023 వరకు 500 మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి కాగా.. చివరి 500 మార్పిడి శస్త్రచికిత్సలను కేవలం 3 సంవత్సరాల 4 నెలల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేయడం వైద్యుల నిబద్ధతకు అద్దం పడుతోంది.

రోబోటిక్ కిడ్నీ మార్పిడి

కేవలం సాధారణ మార్పిడిలే కాకుండా, బహుళ రక్తనాళాలతో కూడిన సంక్లిష్ట కిడ్నీ మార్పిడి, చిన్నపిల్లల్లో కిడ్నీ మార్పిడి, గతంలో విఫలమైన వారికి మళ్లీ మార్పిడి చేయడం వంటి క్లిష్టమైన సవాళ్లను యూరాలజీ విభాగం విజయవంతంగా అధిగమించింది. అంతేకాకుండా, 2025 లో ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో దక్షిణ భారతదేశంలోనే తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి నిమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కిడ్నీ మార్పిడిలతో పాటు, ఈ విభాగం ఏటా సుమారు 11,000 యూరాలజీ శస్త్రచికిత్సలను నిర్వహిస్తోంది. ఇందులో గత మూడేళ్లలోనే 500కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు ఉండటం విశేషం.

అంతర్జాతీయ స్థాయిలో గ్రాఫ్ట్ సర్వైవల్ రేటు

నిమ్స్‌లో జరుగుతున్న శస్త్రచికిత్సల విజయవంతపు రేటు (సక్సెస్ రేట్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంది. జీవ దాతల (లైవ్ డోనర్స్) కిడ్నీ మార్పిడిలో ఏడాది తర్వాత గ్రాఫ్ట్ సర్వైవల్ 95 శాతం పైగా, ఐదేళ్లకు సుమారు 85 శాతంగా ఉంది. అలాగే కాడావర్ (మరణానంతర అవయవదానం) కిడ్నీ మార్పిడిల్లో ఏడాది తర్వాత 90 శాతం పైగా, ఐదేళ్లకు 80 శాతం వరకు గ్రాఫ్ట్ సర్వైవల్ రేటు నమోదవుతోంది.

95 శాతం మందికి ఉచిత వైద్యం

కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలతో కూడుకున్న ఈ శస్త్రచికిత్సను నిమ్స్ పేదలకు సంజీవనిలా అందిస్తోంది. మొత్తం 2000 మంది రోగుల్లో 95 శాతం మంది ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఉచితంగానే చికిత్స పొందారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిమ్స్ పెద్ద దిక్కుగా మారింది.

సమష్టి కృషికి దక్కిన విజయం

ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకోవడం వెనుక నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలోని వైద్య బృందం కృషి ఎంతో ఉంది. అనస్తీషియా, నెఫ్రాలజీ, రేడియాలజీ, పాథాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని డాక్టర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. నిమ్స్ డైరెక్టర్ భీరప్ప నగరి అందిస్తున్న ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారం వల్లే సేవలను బలోపేతం చేయగలిగామని తెలిపారు.

అరుదైన ఘనత: సీఎం రేవంత్ రెడ్డి

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్‌ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్‌లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో నిమ్స్ మూడో స్థానంలో ఉండటం గర్వకారణం.

అత్యాధునిక వైద్యం: మంత్రి దామోదర్

ప్రభుత్వ హాస్పిటల్స్‌ లోనూ అత్యాధునిక వైద్యం అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని నిమ్స్‌ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి సేవలను మరింత విస్తరించి, పేదలకు ఉచితంగా అత్యాధునిక, ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Next Story