- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోల్ గేట్లతో ఎన్.హెచ్.ఏ.ఐ కి కాసుల వర్షం
వాహనాల రాకపోకలు రోజు రోజుకు పెరగటంతో వాటి ద్వారా వసూలు అవుతున్న ఆదాయం రెట్టింపు అవుతోంది. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు తిరగటంతో కేంద్ర ప్రభుత్వానికి అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుంది.

- 11 ఏళ్లలో రూ.3,908 కోట్లు
- కామారెడ్డి డివిజన్ లో ఏడు టోల్ గేట్లు వచ్చిన ఆదాయం
దిశ, తెలంగాణ బ్యూరో: వాహనాల రాకపోకలు రోజు రోజుకు పెరగటంతో వాటి ద్వారా వసూలు అవుతున్న ఆదాయం రెట్టింపు అవుతోంది. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు తిరగటంతో కేంద్ర ప్రభుత్వానికి అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు మినహాయించి మిగిలిన వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మొదలు కొని భారీ వాహనాలు, కార్లు, ఇతర వాణిజ్య వాహనాల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రహదారి శ్రీనగర్-కన్యాకుమారి వరకు నిర్మించిన ప్రధాన రహదారి కావడంతో నిత్యం భారీ వాహనాలు, వాణిజ్య వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్-నాగపూర్ ప్రధాన రహదారి కావడంతో ఈ రెండు నగరాలకు రాకపోకలు సాగించే కార్లు, బస్సులు, ఇతర అద్దె వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటి రాకపోకలతో టోల్ గేట్లకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రధానంగా జాతీయ రహదారులపై ఎన్.హెచ్.ఏ.ఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేసిన టోల్ గేట్లు వాహనదారుల నుంచి ఏటా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి.
కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఎన్.హెచ్.ఏ.ఐ ఏర్పాటు చేసిన టోల్ గేట్ల ద్వారా 11 ఏళ్లలో రూ.3,908 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. కేవలం ఏడు టోల్ గేట్ల ద్వారానే ఇంత ఆదాయం రావడం విశేషం. కామరెడ్డి పరిధిలోకి వచ్చే జాతీయ రహదారి-44 పై ఆరు టోల్ గేట్లు, జాతీయ రహదారి-61 పై ఒకటి టోల్ గేట్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం, ఇందల్ వాయి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ ద్వారా అత్యధికంగా రూ.823.13 కోట్లు వసూలు చేశారు. ఈ టోల్ గేట్ పరిధిలో రోజు సరాసరి 17,026 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అనంతరం మెదక్ జిల్లా మెదక్ మండలం మనోహరబాద్ గ్రామ పరిధిలో నిర్మించిన టోల్ గేట్ ద్వారా రూ.772.62 కోట్ల ఆదాయం సమకూరింది. దీని పరిధిలో రోజుకు దాదాపు 17,311 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బిక్ నూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ద్వారా రూ,674.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ టోల్ ప్లాజా పరిధిలో రోజుకు సగటున 15,230 వాహనాలు తిరుగుతున్నాయి. ఎన్.హెచ్-61 పై నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం, దిల్వార్ పూర్ సమీపంలో కొత్తగా (2018లో) ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ద్వారా కూడా రోజుకు 3,129 వాహనాలు తిరుగుతున్నాయి. ఆరు సంవత్సరాల్లో రూ.40.40 కోట్ల ఆదాయం వచ్చింది.






