- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసుల వర్షం కురిపిస్తున్న తెలంగాణలో ఆ రెండు టోల్‌గేట్లు.. రెండేళ్లలోనే భారీగా ఆదాయం!
జాతీయ రహదారులపై టోల్ గేట్ల ఏర్పాటుతో ఎన్‌హెచ్ఏఐకి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీ ఈ రాబడిని రెట్టింపు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులపై టోల్ గేట్ల ఏర్పాటుతో ఎన్‌హెచ్ఏఐకి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీ ఈ రాబడిని రెట్టింపు చేస్తున్నది. కేంద్రానికి కాసుల వర్షం కురుపిస్తున్నది. రాష్ట్రాలను అనుసంధానం చేసే క్రమంలో గత కొన్నేళ్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) హ్యామ్ పద్ధతిలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నది. వీటి కోసం చేసిన ఖర్చును రాబట్టుకునేందుకు టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నది. అయితే, ఎన్‌హెచ్ఏఐ అంచనాలకు మించి ఈ టోల్ గేట్లు కాసులు కురిపిస్తున్నాయి. నేషనల్ హైవే 363పై మందమర్రి, సారండి వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ల ద్వారా రెండున్నరేళ్లలోనే రూ. 111.71 కోట్ల ఆదాయం సమకూరింది.
రూ. 3,526 కోట్ల అంచనాలతో..
ఎన్‌హెచ్-363లో భాగంగా రాష్ట్రంలో రూ.3,526 కోట్ల అంచనాలతో రాష్ట్రంలో 94 కిలోమీటర్ల రహదారిని ఎన్‌హెచ్ఏఐ నిర్మించింది. మొదటి విడతలో 2019-20లో మంచిర్యాల నుంచి రేపల్లెవాడ వరకు 42 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ పనులు 2024 ఏప్రిల్ నాటికి పూర్తయ్యాయి. రెండో విడతలో రేపల్లెవాడ నుంచి మహరాష్ట్ర సరిహద్దు వరకు 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించగా, 2024 మార్చి నాటికి పూర్తి చేశారు.
80 శాతం పనులు పూర్తి కాగానే టోల్ వసూలు
రెండు విడతల్లో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు 80 శాతం పూర్తి కాగానే టోల్ వసూలు చేయడం మొదలు పెట్టారు. మంచిర్యాల టు రేపల్లెవాడ మధ్య నిర్మించిన రహదారిపై టోల్ వసూలు చేసేందుకు మందమర్రి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. ఇక్కడ 2022 డిసెంబర్ 31 నుంచి టోల్ వసూలు చేయడం ప్రారంభించారు. మొదటి మూడు నెలల్లో రూ.5.68 కోట్లు వసూలు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.34.45 కోట్లు, ఆ తర్వాత 2025 ఏప్రిల్ వరకు రూ.44.20 కోట్ల టోల్ వసూలు చేశారు. ఈ టోల్ గేట్ ద్వారా 30 నెలల్లో మొత్తం 84.33 కోట్లు వసూలయ్యాయి. రెండో విడతలో రేపల్లెవాడ టు మహారాష్ట్ర బార్డర్ వరకు నిర్మించిన రహదారిపై టోల్ వసూలు చేసేందుకు 2023 నవంబర్ 23న సారండి వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేశారు. 2024 మార్చి 31 నాటికి ఇక్కడ రూ.2.25 కోట్లు వసూలు చేశారు. 2025 మే 31 నాటికి రూ.25.13 కోట్లు వసూలయ్యాయి. ఇలా ఈ రెండు టోల్ గేట్ల ద్వారా 2025 మే వరకు మొత్తం రూ.111.71 కోట్లు వసూలు చేయడం గమనార్హం.
పదిహేనేళ్ల వరకు మెయింటెనెన్స్ బాధ్యతలు..
ఈ జాతీయ రహదారి నిర్మాణం హైబ్రిడ్ ఆన్యూటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వ్యయంలో 40 శాతం ప్రభుత్వ వాటా కాగా, 60 శాతం ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందంతో నిర్మించారు. దీని నిర్వహణ (మెయింటెనెన్స్) బాధ్యతలను పదిహేనేళ్ల వరకు నిర్మాణం చేపట్టిన సంస్థే చూసుకుంటుంది. ఈ రహదారిపై వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతుండడంతో మరింత ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.






