మహిళా హక్కులను కాలరాస్తున్న కేంద్రం: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దు

by Ramesh Naini |   (  Updated:2026-01-25 12:48:47  IST  )

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి నిషా సిద్దు తీవ్రంగా ధ్వజమెత్తారు.

మహిళా హక్కులను కాలరాస్తున్న కేంద్రం: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి నిషా సిద్దు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని కేంద్రం దూరం చేస్తోందని ఆమె విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రానున్న కేంద్ర బడ్జెట్‌లో వైద్యం, విద్యా రంగాలకు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు అండగా నిలిచే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసిందని, బడ్జెట్‌లో నిధులను భారీగా తగ్గించిందని నిషా సిద్దు ఆరోపించారు. కేవలం నగరాల పేర్లను మార్చినంత మాత్రాన మోడీ 'విశ్వగురువు' కాలేరని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, రక్షణతో కూడిన నాణ్యమైన జీవనాన్ని అందించాలని హితవు పలికారు.

గత ప్రభుత్వం రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తే, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్' పేరుతో దానిని రూ. 5 లక్షలకు కుదించడం దారుణమని ఆమె దుయ్యబట్టారు. మణిపూర్‌లో మహిళలు, బాలికలపై దారుణమైన దాడులు జరిగిన మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమలు చేయకుండా, 2030 నాటికి చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా, 14 రాష్ట్రాల్లో సర్వేల పేరుతో తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తూ, మహిళల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపించారు.

సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని, డ్రగ్స్ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ఏరులై పారిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనైనా మద్యం, డబ్బు ప్రభావం లేకుండా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఉపాధ్యక్షురాలు ఎస్. చాయాదేవి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. సదాలక్ష్మి, సహాయక కార్యదర్శి ఎం.డి. ఫమీద, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి. హైమావతి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

READ MORE ....

‘షీ టీమ్స్’.. ఆడబిడ్డల జోలికొస్తే.. కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్ హెచ్చరిక

Next Story