తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-27 10:28:08  IST  )

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీపై బిగ్ అప్డే‌ట్ ఇచ్చారు. శ్రీరామనవమి వేళ ఈ కీలక ప్రటకన చేశారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఆరోజే పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు. మేడ్చల్‌ మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెషన్‌లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అనంతరం ఖిల్లా రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘నేను నిజామాబాద్ కోడలిని.. తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ నుంచి తీసుకునే ఆలోచన, నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తొలి ప్రకటన ఇక్కడినుంచి చేయాలని నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి కావాలి. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ రావాలి. తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది. నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయాం. ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలి. కొత్త రాజకీయ పార్టీ ఉండాలని బలంగా కోరుకుంటున్నాం’ అని కవిత ప్రకటన చేశారు.

మహిళలు, యువతకు అవకాశం..

కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు కవిత వెల్లడించారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై ముమ్మర చర్చ సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు సాంస్కృతిక మూలాలను బలంగా విశ్వసించే కవిత, ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story