గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసి మరోసారి మాట నిలబెట్టుకున్నారు...

గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో సుమారు రూ.కోటి విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి గతంలో బల్లగరువు పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తాగునీరు, అంగన్వాడీ భవనాలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆయన, ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చారు.

మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో మూడు అంగన్వాడీ కేంద్రాలను రూ.55 లక్షల వ్యయంతో నిర్మించారు. బల్లగరువు, వెలగపాడులో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించగా, కొరపర్తిలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ నిర్మించారు. అదనంగా కొరపర్తి గ్రామంలో ఎంపీపీ పాఠశాల భవనాన్ని పునరుద్ధరించారు. తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేసి, నీటి సరఫరా పైప్‌లైన్లు వేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు.

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గిరిజనులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story