డ్రగ్స్‌ రహిత గ్రామమే సురక్షితం

by Batti.Sumithra |

పెబ్బేరు మండలంలోని పాతపల్లి గ్రామంలో ఆదివారం డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డ్రగ్స్‌ రహిత గ్రామమే సురక్షితం
X

దిశ, పెబ్బేరు : పెబ్బేరు మండలంలోని పాతపల్లి గ్రామంలో ఆదివారం డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామసర్పంచి చైతన్య భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెబ్బేరు ఎస్సై వెంకటేష్ గౌడ్ పాల్గొని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం.. గ్రామాన్ని రక్షిద్దాం అంటూ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. యువత చెడు మార్గంలో పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Next Story