వేల కోట్లు ఖర్చు.. ఫలితం శూన్యం: పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ధ్వజం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-05 11:31:19  IST  )

వేల కోట్లు ఖర్చు.. ఫలితం శూన్యం: పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ధ్వజం
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్‌ను సందర్శించిన సీఎం, అనంతరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. నార్లాపూర్ రిజర్వాయర్, ఎంఎల్‌కేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్ హౌస్ పనులను తనిఖీ చేశారు. అలాగే వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ-9, 10, 11 పనులపై సమీక్ష నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం, కుమ్మెరలోని పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8, స్టేజ్-3 పంప్ హౌస్ పనులపై కూడా ఆరా తీశారు.

ప్రాజెక్టుల పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో జూరాల ప్రాజెక్టు మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు ఇంకా పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. భూసేకరణ పూర్తికాకుండానే ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్ ఎలా భావించారో అర్థం కావడం లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, అయితే రూ.27 వేల కోట్ల వ్యయంతో పంపులు, లిఫ్ట్ పనులు చేసినప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. కమిషన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రజలు అమాయకులు కాదని, వాస్తవాలు వారికి అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నామని తెలిపారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు భూసేకరణ అంశంపై అడ్డంకులు సృష్టించకుండా ఉంటే అదే వారు చేసే పెద్ద సహాయమని అన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ చేయాలన్నారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ చేయకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపలేమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పంపులు, లిఫ్ట్ పనుల్లో జరిగిన అవినీతిపై మాజీ ఎంపీ నాగం జనార్ధన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. చివరికి వాటి పనులు చేపడితే.. కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసిందని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, రూ.55 వేల కోట్ల అంచనా వ్యయంలో కనీసం 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తయ్యాయని ప్రశ్నించారు.

Next Story