- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పోచంపల్లి చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్ హైటెక్స్‌లో జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న "థ్రెడ్ పోచంపల్లి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్"ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: పోచంపల్లి చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్ హైటెక్స్‌లో జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న "థ్రెడ్ పోచంపల్లి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్"ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. చేనేత కార్మికుల శ్రమకు తగిన గౌరవం, ఆదాయం దక్కేలా మార్కెటింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 12 వేల మంది చేనేత కార్మికులు, అనుబంధ వృత్తిదారులు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
వారి కుటుంబాలకు అండగా నిలవొచ్చు..
పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తెలియా రుమాలు వంటి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. పోచంపల్లి నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారని, అందుకే పోచంపల్లి "సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా"గా ఖ్యాతి గడించిందన్నారు. ఒక చీర వెనుక నేతన్న కుటుంబాల కష్టం, కళ, జీవన పోరాటం దాగి ఉంటుందని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. సుమారు 100 చేనేత స్టాల్స్‌తో పాటు స్వయం సహాయక సంఘాలు, అనుబంధ సంస్థల స్టాల్స్‌ను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






