ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నయా దోపిడీ.. ఇదేం బుద్ధి ఛీఛీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-25 02:21:31  IST  )

నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నయా దోపిడీ.. ఇదేం బుద్ధి ఛీఛీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ డబ్బులను సైతం దోపిడీ చేస్తున్నాయి. ఒకవైపు అత్యున్నత న్యాయస్థానం గత సంవత్సరంలోనే ఇదే అంశంపై ఇచ్చిన ఉత్తర్వులు సైతం లెక్క చేయడం లేదు. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై పలుమార్లు ప్రశ్నించిన మెడికోలు ఆగ్రహంతో నిరసనకు దిగారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న మెడికోలు, పీజీలు కాలేజీల ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకొని యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏంటి ఈ వివాదం?

నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే అధికారికంగా ఎంబీబీఎస్ ఇంటర్న్స్‌కు 25000, పీజీ విద్యార్థులకు 58289-64767 రూపాయల చెల్లించాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల నుంచి మొదట్లో అడ్మిషన్ సమయంలోనే లక్షలు వసూలుచేస్తున్న యాజమాన్యాలు.. అడ్వాన్స్‌గా వారి వద్ద నుంచి చెక్కులను సైతం తీసుకుంటున్నాయి. స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి స్పందించడం లేదు. ఒక్కో విద్యార్థిపై దాదాపు కోటి 20 లక్షల వరకు కాలేజీలు వెనకేసుకుంటున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

కూలీలా కన్నా తక్కువ గానా?

కొన్ని కాలేజీలు అయితే నెలవారీ కనీస వేతనంగా ఉన్న రూ.5300 కన్నా మెడికోలకు తక్కువగా చెల్లిస్తున్నాయి. కొందరికైతే కేవలం రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నాయి. అదే సమయంలో యాజమాన్యానికే చెందిన ఆస్పత్రుల్లో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయి. ఇదేమని ప్రశ్నించిన విద్యార్థులను రకరకాలుగా వేధిస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

గత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఇదే అంశంపై వాదనలు విన్న జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాల్‌తో కూడిన ధర్మాసనం నేషనల్ మెడికల్ కమిషన్ వ్యవహార శైలిని ఎండగట్టింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇంత జరిగినా కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికీ వారు ఇస్తున్న స్టైఫండ్ సమాచారం నేషనల్ మెడికల్ కమిషన్‌కు అందించలేదంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థమవుతుంది.

మరి కమిషన్ ఏం చేస్తోంది?

విషయం ఇంత సీరియస్‌గా ఉన్నా కమిషన్ మాత్రం నేరుగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కాలేజీ యాజమాన్యాలపై కఠినంగా స్పందించాల్సిన కమిషన్ కేవలం ఆయా రాష్ట్రాల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు లేఖలు రాస్తూ సమయం గడుపుతోంది. దీంతో చాలా వరకు విద్యార్థులు స్టైఫండ్‌పై ఆశలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వైద్య విద్య నాణ్యత విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఇలాంటి యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితులు మారేలా లేవు. తనిఖీలకు సిద్ధమవుతున్న కమిషన్ ఈసారైనా ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

Next Story