మ్యాన్ హోల్స్‌లో పడిపోయిన చిన్నారులు.. తమకు సంబంధం లేదంటున్న హైడ్రా, జీహెచ్ఎంసీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-12 02:48:21  IST  )

పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా డివిజ‌న్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్‌లో ప‌డిపోయిన చిన్నారి ఘటనపై తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి ప్రకటించాయి.

మ్యాన్ హోల్స్‌లో పడిపోయిన చిన్నారులు.. తమకు సంబంధం లేదంటున్న హైడ్రా, జీహెచ్ఎంసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా డివిజ‌న్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్‌లో ప‌డిపోయిన చిన్నారి ఘటనపై తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి ప్రకటించాయి. హైడ్రా అధికారులు మాత్రమే స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు వరదనీటి కాలువకు సంబంధించిన మ్యాన్‌హోల్ ఓపెన్ చేశామని చెబుతున్నారు. ఆ ఘటనతో తమకు సంబంధంలేదని జీహెచ్ఎంసీ ప్రకటించింది. దీంతోపాటు ‘పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా డివిజ‌న్ మౌలాకా చిల్లాలోని మ్యాన్‌హోల్‌లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌లో ఉన్న మ్యాన్‌హోల్ జలమండలి సంబంధించినది కాదు. ఆ ఘటనకు జలమండలికి సంబంధం లేదు’ అంటూ జలమండలి అధికారులు వెల్లడించారు.

పునరావృతం కాకుండా చర్యలు : హైడ్రా

పాత‌బ‌స్తీలోని యాకుత్‌పురా డివిజ‌న్ మౌలాకా చిల్లాలో ని మ్యాన్‌హోల్‌లో ప‌డిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేక‌పోవ‌డంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించింది. బాధ్యులు ఎవ‌ర‌నే దానిపై ప్రాథ‌మికంగా వెంట‌నే ద‌ర్యాప్తు చేసింది. ఈ మేరకు బుధవారం మ్యాన్‌హోల్ తెరిచినప్పటి నుంచి గురువారం ఉదయం చిన్నారి పడిపోయిన వరకు.. అక్కడి సీసీటీవీ ఫుటేజీను తెప్పించుకుని పరిశీలిస్తోంది. అలాగే స్థానికంగా ప‌ని చేస్తున్న హైడ్రా, జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ విభాగాల‌తో శుక్రవారం స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక కార్పొరేట‌ర్ ఆదేశాల‌ మేర‌కు.. అక్కడ మ్యాన్‌హోల్‌ ను తెరిచి మ‌ట్టి తీసే ప‌నిని హైడ్రా చేప‌ట్టింది. కొన్నేళ్లుగా మ‌ట్టి పేరుకుపోవ‌డంతో గ‌ట్టిగా మారి తొల‌గించ‌డానికి వీలు లేకుండా పోయింది. జ‌ల‌మండ‌లి జెట్టింగ్ మెషిన్లతో తొల‌గించాల‌ని నిర్ణయించారు. ఆ వెంట‌నే జ‌ల‌మండ‌లి జెట్టింగ్ మెషిన్ వ‌చ్చి శుభ్రం చేసే ప‌నిలో నిమగ్నమైంది. వేరే మ్యాన్‌హోల్ శుభ్రం చేసే ప‌నిని స్థానిక కార్పొరేట‌ర్ సూచించ‌డంతో హైడ్రా మెట్ సిబ్బంది అక్కడ‌కు వెళ్లారు. జ‌ల‌మండ‌లి సిబ్బంది ప‌ని అయిన త‌ర్వాత మ్యాన్‌హోల్ మూత వేయ‌కుండా వెళ్లిపోయినట్టు సమాచారం. బుధ‌వా రం సాయంత్రం రెండో షిఫ్టు మెట్ సిబ్బంది గ‌మ‌నించి మూత వేయ‌డానికి ప్రయ‌త్నించ‌గా.. ఇంకా ప‌ని కాలేదు.. తెరిచే ఉంచాలని స్థానికంగా ఉన్న వాళ్లు అడ్డుకోవ‌డంతో మూత వేయ‌కుండానే వెళ్లిపోయారు. గురువారం ఉద‌యం పాఠ‌శాల స‌మ‌యంలో ఓ చిన్నారి అందులో ప‌డిపోవ‌డం.. ఆ చిన్నారిని పాఠ‌శాల‌కు తీసుకెళ్లే త‌ల్లి చూసి పాప‌ను కాపాడారు. త‌ల్లి అప్రమ‌త్తత‌తో చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం జ‌ర‌గ‌లేదు. ఆ వెంట‌నే స్థానికులు స్పందించ‌డంపై హైడ్రా ఎంతో ఊర‌ట చెందింది.

9000113667 నెంబ‌రుకు స‌మాచారం ఇవ్వండి

వ‌ర్షాకాలం వ‌ర‌ద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూత‌లు తెర‌వ‌డం.. వ‌ర‌ద త‌గ్గగానే వాటిని తిరిగి మూత వేయ‌డం జ‌రుగుతోంది. మ్యాన్‌హోల్ మూత తెర‌చి ఉన్నంత వ‌ర‌కు అక్కడే మెట్ సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు హైడ్రా తీసుకుంది. ఒక వేళ ఎక్కడైనా పొర‌పాటున మ్యాన్‌హోల్ మూత తెర‌చి ఉంటే.. ఆ స‌మాచారాన్ని 9000113667 నెంబ‌రుకు ఫోను ద్వారా తెలియ‌జేయా ల‌ని హైడ్రా ఒక ప్రక‌ట‌న‌లో కోరింది.

Next Story