పల్లెల్లో రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం

by Muthe.Rajitha |

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రూ. 2,199 కోట్ల తో పనుల జాతర కార్యక్రమం శుక్రవారం చేపట్టనున్నారు.

పల్లెల్లో రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రూ. 2,199 కోట్ల తో పనుల జాతర కార్యక్రమం శుక్రవారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో లక్షకు పైగా పనులు చేపడతారు. మార్చి 2026 నాటికి అన్ని పనులను పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామంలో పనుల జాత‌ర‌ను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు గ్రామీణాభివృద్ధి బాటలో ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలుస్తుంది.

ఇది రాజకీయాలకు అతీతమైన పండుగ. ఎమ్మెల్యేలంతా ఈ పనుల జాతరలో పాలుపంచుకోవాఅని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక లేఖలు రాసి, తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయం వేదికగా పనుల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, పనుల జాతర లో భాగంగా చేపట్టి పనుల వివరాలను వెల్లడించారు. ఈ జాతరలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అమలు చేయనున్నారు. పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, చెక్‌డ్యాములు, ఊటకుంటలు, ప్లాస్టిక్ వెస్ట్ యూనిట్లు, గ్రామీణ రహదారులు, కమ్యూనిటీ టాయిలెట్లు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి పనులను చేపట్టనున్నారు.

గతేడాది నవంబర్‌లో రూ. 4,529 కోట్లతో నిర్వహించిన పనుల జాతర–2024 విజయవంతం అయినట్లుగానే ఈ దఫా పనుల జాతరను విజయవంతం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ పనుల జాతర పల్లెల్లో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, జల సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, జీవన ప్రమాణాల పెరుగుదలకూ దోహదం చేస్తుందన్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల జాబితాను జిల్లా డీఆర్డీఓ అధికారులు సిద్ధం చేశారు. పనుల జాతరలో భాగంగా ప్రతి గ్రామంలో ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, కొత్త పనులకు శంకుస్థాపన జరగనుంది.

Next Story