- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగర్ మంగ్లీ వివాదంలో కొత్త ట్విస్ట్: లాయర్ సుబ్బారావుపై ఎదురుదాడి!
ప్రముఖ సినీ గాయని మంగ్లీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గాయని మంగ్లీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపైనే ఆమె ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికంటే ముందే, తానే నార్సింగి పోలీసులను ఆశ్రయించానని మంగ్లీ స్పష్టం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు. "ఆ డబ్బు నాది కాదు, ఆ వ్యవహారంతో నాకు సంబంధం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారంపై అసహనం..
లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మంగ్లీ హెచ్చరించారు. ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆమె వెల్లడించారు. "తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. నోట్ల కట్టల వ్యవహారానికి నాకు సంబంధం లేదు. నన్ను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా లాయర్ సుబ్బారావు అసత్యాలు చెబుతున్నారు." అని సింగర్ మంగ్లీ స్పష్టం చేశారు.
కాగా, మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






