- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. 10 నుంచి కొత్త విధానం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామన్నారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి వస్తుందని ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం(R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్ (R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ కార్యాలయాల్లో ప్రారంభిస్తున్నామన్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించినట్లు చెప్పారు. ప్రజలు నేరుగా registration.telangana.gov.in వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని తెలిపారు.
అదనపు సిబ్బంది నియామకం
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి మరియు 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు మరియు సిబ్భందిని నియమించినట్లు చెప్పారు. దీంతో కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పని భారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేస్తామన్నారు.
సొంతంగా డాక్యుమెంట్లు
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్ సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశ పెట్టామని మంత్రి ప్రకటించారు. మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు. ఇది కూడా ఐచ్చికమేననన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వల్ల దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వల్ల ప్రజల సమయం వృథా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ-సంతకం ప్రవేశపెడుతున్నామని ఈ నెల చివరిలోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్ లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నామని మంత్రి తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలను సవరించుకున్నాయని, అదే విధంగా తెలంగాణలో కూడా చట్టసవరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22 కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.






