టెక్నికల్ విద్యకు పెరుగుతున్న డిమాండ్.. కొత్త కోర్సుల్లో విద్యార్థుల జోష్

by Naga Rani Yarlagadda |

పాలిటెక్నిక్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పది కోర్సులకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.

టెక్నికల్ విద్యకు పెరుగుతున్న డిమాండ్.. కొత్త కోర్సుల్లో విద్యార్థుల జోష్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాలిటెక్నిక్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన పది కోర్సులకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కొత్త కోర్సుల్లో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ వంటి బ్రాంచ్‌ల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సాంకేతిక విద్యను నమ్ముకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది పాలిటెక్నిక్ సీట్ల భర్తీ ప్రక్రియ జోరుగా సాగింది. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 4 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన కొత్త కోర్సులు, పెరిగిన సీట్ల సంఖ్య విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ 96.21 శాతం, క్లౌడ్ కంప్యూటింగ్ 94.44 శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 89.63 శాతం, సెమీకండక్టర్ టెక్నాలజీ 88.78 శాతం సీట్లు నిండాయి. మొత్తంగా సీఎస్ఈలో 5,478(74 శాతం), ఈసీఈలో 4,129(69.42 శాతం), ఈఈఈలో 4,094 (68.45శాతం), మెకానికల్‌లో 2,924 (76 శాతం) సివిల్‌లో 2,866 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.

ల్యాండ్‌స్కేప్ డిజైన్‌పై అనాసక్తి..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన సరికొత్త పాలిటెక్నిక్ కోర్సులకు కూడా మంచి స్పందన లభిస్తోంది. కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో సగటున 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కొత్త కోర్సుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో వందశాతం సీట్లు భర్తీ కావడం విశేషం. ల్యాండ్ స్కేప్ డిజైన్ కోర్సుపై మాత్రం విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

92 శాతం సీట్ల భర్తీ..

పాలిటెక్నిక్ కళాశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీలకు విద్యార్థులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలిటెక్నిక్ ఫైనల్ ఫేజ్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సుమారు 92 శాతం సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 33,535 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి విడత ముగిసేసరికి 25,111 సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 18,538 సీట్లు ఉండగా 17 వేల సీట్లు నిండిపోయాయి. 53 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 14,997 సీట్లు ఉంటే కేవలం 8,110 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. నాణ్యమైన విద్య, తక్కువ ఫీజులు, మెరుగైన ఉపాధి అవకాశాల దృష్ట్యా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

Next Story