డ్రైనేజీ ధ్వంసం చేసి నిర్మాణం.. ప్రజారోగ్యంతో చెలగాటం

by Kodari Anjali |

కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో నిర్మాణ పనుల కోసం డ్రైనేజీ కాలువను ధ్వంసం చేయడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి తీవ్ర సమస్యగా మారింది.

డ్రైనేజీ ధ్వంసం చేసి నిర్మాణం.. ప్రజారోగ్యంతో చెలగాటం
X

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో నిర్మాణ పనుల కోసం డ్రైనేజీ కాలువను ధ్వంసం చేయడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పలు ఆస్పత్రులు ఉండటంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం వందలాది మంది రోగులు, వారి బంధువులు, అత్యవసర సేవల కోసం వచ్చే అంబులెన్సులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నప్పటికీ, మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆస్పత్రుల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాల్సిన చోట మురుగునీరు నిల్వ ఉండటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మాణ యజమానులు డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనులు కొనసాగిస్తుండగా, మున్సిపల్ అధికారులు మాత్రం మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దుర్వాసన, దోమల వ్యాప్తితో పాటు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతున్నా చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే పట్టణ పరిశుభ్రతపై అధికారుల చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అర్థమవుతోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. వెంటనే డ్రైనేజీని పునరుద్ధరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story