TRS పేరు సరే.. ఏ సింబల్ ఏంటో?.. కవిత పార్టీ విషయంలో బీఆర్ఎస్‍లో జోరుగా చర్చ

by Prasad Jukanti |   (  Updated:2026-04-25 09:06:11  IST  )

కవిత ప్రకటించిన కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన (TRS)కు ఏ సింబల్ రాబోతోందని అనేది బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

TRS పేరు సరే.. ఏ సింబల్ ఏంటో?.. కవిత పార్టీ విషయంలో బీఆర్ఎస్‍లో జోరుగా చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం షురూ అయింది. బీఆర్ఎస్‍లో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి దూరమైన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ నూతన రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)’ పేరుతో సరికొత్త రాజకీయ వేదికకు శ్రీకారం చుట్టారు. అయితే కవిత ప్రకటించిన పార్టీ పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. పార్టీ నేమ్ అబ్రివేషన్ టీఆర్ఎస్ అని ఉండటంతో ఈ పేరు లీగల్‍గా ఏ మేరకు చెల్లుబాటు అవుతుంది? ఈ పేరును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇస్తుందా? అనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్‍లో ఆందోళన:

టీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ అనంతరం పార్టీ పేరును బీఆర్ఎస్‍గా మార్చారు. ఇప్పుడు పాత టీఆర్ఎస్ పేరుకు సారూపత్య ఉండేలా కవిత తన కొత్త పార్టీని అనౌన్స్ చేయడంతో ఈ పరిణామం గులాబీ పార్టీలో అలజడి రేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్ చేస్తూ కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పేరు చెల్లుబాటు కాదని వాదిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పేరు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఆయన.. ఈసీఐ ఇందుకు అనుమతి ఇవ్వదని, ECI నిబంధనలు ఒకేలా లేదా చాలా దగ్గరగా ఉన్న పేర్లను మళ్లీ ఉపయోగించడాన్ని నిరోధిస్తాయని పేర్కొన్నారు. పేరు ఇప్పటికే ఉన్న లేదా గతంలో ఉన్న పార్టీ పేరుతో పూర్తిగా ఒకటే లేదా చాలా దగ్గరగా ఉండి ఓటర్లలో గందరగోళం కలిగించే అవకాశం ఉంటే అలాంటి పేర్లతో కొత్త పార్టీని నమోదు చేయదని తెలిపారు. ఏదైనా పార్టీ తన పేరు మార్చుకుంటే ఆ పేరు ఇతరులు వాడకుండా గరిష్టంగా 10 సంవత్సరాల పరిమితి (క్యాప్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నా బలమైన అభిప్రాయం ప్రకారం కవిత పార్టీ ఇంకా ECI వద్ద నమోదు కాలేదు. ఇది కేవలం మనలను ఇబ్బంది పెట్టడానికి చేసిన ఒక టాక్టిక్ మాత్రమే. ఇప్పటికే నమోదు అయిన అన్ని రాజకీయ పార్టీలు ECI వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఇప్పటివరకు కేవలం దరఖాస్తు (అప్లికేషన్) మాత్రమే చేసివుండొచ్చు అని పోస్టు చేశారు.

పార్టీ పేరు సరే సింబల్ ఏంటో?:

కవిత ప్రకటించిన పార్టీ పేరు సంగతి అలా ఉంచితే కొత్త పార్టీ ఏ సింబల్ రాబోతోంది అనేది కారు పార్టీకి ఆందోళనకరంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా బీఆర్ఎస్ మద్దతుదారులే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు చేస్తున్నారు. కవిత పార్టీకి కేటాయించబోయే సింబల్ ఎలా ఉండబోతోంది అనేదానిపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తే కవిత పార్టీకి కేటాయిస్తే అది కేసీఆర్ పార్టీకి మరింత దెబ్బగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోటి మేకర్, రోడ్డు రోలర్ వంటి ఎన్నికల గుర్తులు బీఆర్ఎస్ గెలుపును తీవ్రంగా ప్రభావితం చేశాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ సింబల్స్ కు వేలల్లో ఓట్లు నమోదు కావడం గులాబీ పార్టీని టెన్షన్ పెట్టించే అంశం. ఈ గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని చాలా కాలంగా బీఆర్ఎస్ ఈసీని కోరుతోంది. కానీ స్వతంత్ర అభ్యర్థులకు ఈ సిబంల్స్ అధికారులు కేటాయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కవిత ప్రకటించిన పార్టీకి కారు గుర్తును పోలిన సింబలే ఇస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ పేరు, ఎన్నికల సింబల్స్ విషయంలో కేసీఆర్ టీమ్ ఎలాంటి ముందడుగు వేస్తుందో అనేది వేచి చూడాలి.

TRS హ్యాంగోవర్‍లోనే కవిత.. కొత్తపార్టీపై బీజేపీ ఎంపీ అర్వింద్ రియాక్షన్

Next Story