విద్యుత్ శాఖలో నయా జోష్: ప్రమోషన్లతో రైతు డిస్కంలోకి బదిలీలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 02:06:00  IST  )

తెలంగాణ రైతు డిస్కం (TGRPDCL)లో ఉద్యోగుల భర్తీకి విద్యుత్ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

విద్యుత్ శాఖలో నయా జోష్: ప్రమోషన్లతో రైతు డిస్కంలోకి బదిలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న తెలంగాణ రైతుపవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)లో సిబ్బంది నియామకానికి సంబంధించి విద్యుత్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లను బదిలీ ద్వారా ఈ కొత్త డిస్కంలోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా బదిలీ కోరుకునే వారికి తదుపరి కేడర్‌కు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఎవరు అర్హులంటే?

టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్ కో, టీజీ జెన్ కోలో ప్రొబేషన్ పూర్తి చేసుకున్న రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు రైతు డిస్కంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. మార్చి 31, 2026 నాటికి ఎస్ఈ కేడర్ వారికి ఏడాది, డివిజనల్ ఇంజినీర్ అంతకంటే తక్కువ కేడర్ వారికి రెండేళ్ల కనీస సర్వీస్ ఉండాలి. ఈ బదిలీ ప్రక్రియలో భాగంగా ఎస్ఈ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ వరకు, అలాగే అకౌంట్స్, పీఅండ్‌జీ కేడర్ల వారికి ఒక స్థాయి పై కేడర్‌కు పదోన్నతి లభిస్తుంది. ఉదాహరణకు ఎస్ఈగా ఉన్నవారు చీఫ్ ఇంజినీర్‌గా, ఏఈ/ఏఏఈలుగా ఉన్నవారు డివిజనల్ ఇంజినీర్లుగా పదోన్నతి పొందనున్నారు.

ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులు

ప్రమోషన్ పొంది బదిలీ అయినవారు ఐదేళ్ల వరకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పొందేందుకు లేదా ఇతర సంస్థలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు వీలుండదు. బదిలీ కోరుకునే ఉద్యోగులు కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కాగా.. మే 8న చివరి తేదీగా ప్రకటించారు. నియామక ఉత్తర్వులను మే 13న జారీచేస్తారు. మే 15న ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టు నుంచి రిలీవ్ అయి... మే 25లోపు టీజీఆర్పీడీసీఎల్ లో తమకు కేటాయించిన ప్లేస్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. బదిలీ అయినప్పటికీ ఉద్యోగుల వేతన సర్వీస్ నిబంధనలు వారి మాతృసంస్థల ప్రకారమే కొనసాగుతాయి. ఒకసారి ఆప్షన్ ఇస్తే మార్చుకునేందుకు వీలుండదని టీజీఆర్పీడీసీఎల్ అధికారులు స్పష్టం చేసింది.

Next Story