TGSPDCL: ప్రమాదాలు, చెత్తకు చెక్..! ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటులో నూతన పద్ధతి

by Ramesh Naini |

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త చర్యలు చేపట్టింది.

TGSPDCL: ప్రమాదాలు, చెత్తకు చెక్..! ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటులో నూతన పద్ధతి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Greater Hyderabad) గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) కొత్త చర్యలు చేపట్టింది. అధికారులు నగరంలోని (transformers) ట్రాన్స్‌ఫార్మర్‌ల అమరిక విధానంలో వినూత్న మార్పులు చేశారు. ఇప్పటి వరకు, ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు రహదారుల పక్కన నేలమట్టానికి సమీపంగా అమర్చబడి ఉండేవి. ఈ పద్ధతి వల్ల పాదచారులకు అసౌకర్యం కలగడంతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ చుట్టుపక్కల చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల వలన ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్‌లు, విద్యుత్ లీకేజీలు కూడా చోటుచేసుకుని ప్రమాదాలు సంభవించాయి.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ‌లో పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఒక కొత్త సాంకేతిక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ నూతన పద్ధతిలో, విద్యుత్ స్తంభానికి దాదాపు 10 అడుగుల ఎత్తులో ఐరన్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసి, దాని మీద ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చుతారు. ఈ విధానం వల్ల ట్రాన్స్‌ఫార్మర్ నేలమట్టానికి దూరంగా ఉండి, పాదచారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగదు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చెత్త లేదా ఇతర వ్యర్థ పదార్థాలు చేరకుండా ఉండడం వలన భద్రతా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి.

అంతేకాక, ఈ విధానం ట్రాన్స్‌ఫార్మర్ స్ట్రక్చర్ ఖర్చును కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే పెద్ద స్థాయి కాంక్రీట్ ఫౌండేషన్ అవసరం ఉండదు.. అని టీజీఎస్పీడీసీఎల్ వివరించింది. గురువారం అంబర్‌పెట్ పోలీస్ లైన్లో ఏర్పాటు చేసిన పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ నమూనాను సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూఖీ పరిశీలించి తగు సూచనలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసే ట్రాన్స్ ఫార్మర్‌లకు ఈ పద్ధతినే వాడాలని సూచించారు.

Next Story